కడప: ఆంధ్ర ప్రదేశ్ లో అధికార వైసిపిలో విషాదం నెలకొంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలోని బద్వేల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతిచెందారు. 
 
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన ఎమ్మెల్యే సుబ్బయ్య ఇటీవల హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందారు. అయితే ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో పాటు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గానికి చేరుకున్నారు. ఈ క్రమంలో మరోసారి ఆయన అనారోగ్యానికి గురవడంతో కడపలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు. అయితే ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. 

 ఎమ్మెల్యే సుబ్బయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు. ఆయన మృతితో ఆయన కుటుంబంలోనే కాదు పార్టీలోనూ విషాదం నెలకొంది. ఆయన మృతి  పట్ల పలువురు వైకాపా నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు.