ప్రభుత్వాలన్నీ నిజంగా అన్ని కోట్ల రూపాయలు పేదల సంక్షేమం కోసం ఖర్చు చేస్తే మరి సమాజంలో ఇంకా పేదరికం ఎందుకున్నట్లు? కొత్త ముఖ్యమంత్రులకు పేదరికాన్ని రూపుమాపే అవకాశాలు ఎందుకు వస్తున్నట్లు?
చంద్రబాబు జీవితాశయం నెరవేరేటట్లు కనబడటం లేదు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు పేదరికం లేని సమాజాన్ని చూడటమే తన జీవితాశయంగా చెప్పుకొచ్చారు. సిఎం మాటలు విన్న వారు సమాజంలో పేకరికం లేకుండా చేయటం ఎవరి తరమని నవ్వుకుంటున్నారు. దశాబ్దాల తరబడి ఎందరో ముఖ్యమంత్రులు ఇప్పటి వరకూ ఇవే మాటలు చెప్పారు గానీ సమాజంలో పేదరికం ఏ మేరకు పోయిందో ఎవరైనా చూసారా. అసలు సమాజమంటేనే అన్నీ రకాల మనుషుల కలగలుపు.
సమాజంలో కులాలు, మతాలున్నట్లే ధనిక, పేద వర్గాలు కూడా ఉన్నాయి, ఉంటాయి కూడా. ఎక్కడైనా పేదకుటుంబంలోని వ్యక్తి కష్టపడి చదవి పైకొచ్చి బాగా డబ్బు సంపాదిస్తే సంపాదించవచ్చు గాక. అటువంటి ఉదాహరణ ఎక్కడో కానీ కనబడదు. అంతెందుకు ప్రతీ ముఖ్యమంత్రీ పేదల సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వ్యయం చేసినట్లు చెప్పుకున్నారు.
దశాబ్దాలుగా ఎన్నో ప్రభుత్వాలు మారి ఉంటాయి. మరి ప్రభుత్వాలన్నీ నిజంగా అన్ని కోట్ల రూపాయలు పేదల సంక్షేమం కోసం ఖర్చు చేస్తే మరి సమాజంలో ఇంకా పేదరికం ఎందుకున్నట్లు? కొత్త ముఖ్యమంత్రులకు పేదరికాన్ని రూపుమాపే అవకాశాలు ఎందుకు వస్తున్నట్లు? పడికట్టు పదాలు వాడటం కాకుండా వాస్తవాలు కాస్త ఆలోచించండని జనాలంటున్నారు.
