విశాఖపట్నం: సోషల్ మీడియా వేదికన వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. జగన్ గుట్టును బయటపెట్టాలని విజయసాయి కుట్రలు పన్నుతున్నారని అయ్యన్న ఆరోపించగా, చంద్రబాబు ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తుందోనని హైదరాబాద్ నుండి కరకట్టకు పారిపోయి వచ్చాడని విజయసాయి మండిపడ్డారు.  

ప్రపంచంలో ప్రతి విషయం పైనా ట్విట్టర్లో ఎగిరి దూకే ఎంపీ విజయసాయి రెడ్డి జడ్జీలపై సీఎం జగన్ రాసిన లేఖపై కిక్కురుమనడం లేదు ఎందుకని? రెచ్చిపోతే బెయిల్ రద్దు అవుతుందని భయమా? లేకపోతే అప్రూవర్ గా మారిపోయి అసలు గుట్లన్నీ బయట పెట్టేద్దామనా?'' అని అయ్యన్న ట్వీట్ చేశారు. 

''ఓటుకు నోటు కేసులో అరెస్టు భయంతోనే కరకట్టకు పారిపోయి వచ్చాడని గుసగుసలు. ‘మన వాళ్లు బ్రీఫుడ్ మీ’ అనే వాయిస్ తనదేనని ఫోరెన్సిక్ ల్యాబులు తేల్చాయి. సాక్ష్యాలు పక్కాగా ఉన్నాయంట. ‘వెయ్యి గొడ్లను పీక్కుతిన్న రాబందు’ సామెత ఇలాంటి వారి కోసమే పుట్టి ఉంటుంది''  అంటూ చంద్రబాబుపై విజయసాయి రెడ్డి మండిపడ్డారు. 

''అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్ గురించి శోకాలు తప్ప ప్రజల కోసం ఏనాడైనా నోరు విప్పారా బాబూ! ఎప్పుడో ఒకసారి సందర్శకుల్లా వచ్చి రెచ్చగొట్టే స్పీచులు దంచిపోవడమే ప్రజా సేవ అనుకుంటే ఎలా? జీతభత్యాలు తీసుకుంటున్నందుకైనా రాష్ట్రానికి పనికొచ్చే సలహాలు ఇవ్వండి'' అని విజయసాయి ట్వీట్ చేశారు.