విశాఖపట్నం: రాష్ట్రంలో కరోనా విలయతాండవంతో ప్రజలంతా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని భయంతో బతకడానికి కారకుడు మన మూర్ఖుడైన ముఖ్యమంత్రేనని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. కరోనా వస్తే ఏ ఆసుపత్రికి వెళ్లాలో తెలియడంలేదని... ఎక్కడ కరోనా చికిత్స అందిస్తున్నారో తెలియని గందరగోళ పరిస్థితుల్లో ప్రజలు వున్నారన్నారు. ఇక చాలా ఆసుపత్రుల్లో కనీసం బెడ్లు కూడా దొరకడం లేదని అయ్యన్న ఆందోళన వ్యక్తం చేశారు. 

''ప్రభుత్వం ఎలా పనిచేస్తోందో చూస్తున్నాం. మృత దేహాలను తరలించడానికి కూడా అంబులెన్సులు దొరకడం లేదు. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి, మూర్ఖుడైన ముఖ్యమంత్రికి ఆలోచన రావడం సిగ్గుచేటు. 16లక్షల మంది విద్యార్థులు పది, ఇంటర్ పరీక్షలు రాయాల్సి ఉందని, వారితో పాటు తల్లిదండ్రులు, భోదనా, బోధనేతర సిబ్బంది కలుపుకొని సుమారు 40లక్షల మంది వరకు కరోనాకు గురయ్యే అవకాశముంది'' అని అయ్యన్న పేర్కొన్నారు.  

''40లక్షల మందికి కరోనా వస్తే పరిస్థితి ఏమిటనే ఆలోచన ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రికి లేదా? కరోనా రెండోదశ వ్యాప్తి చాలావేగంగా, ప్రమాదకరంగా ఉందని, చిన్నపిల్లలు కూడా వైరస్ బారినపడుతున్నారు. పరీక్షలు వాయి దా వేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు కోరుతున్నా ముఖ్యమంత్రి మూర్ఖంగా ముందుకెళ్లాలని చూడటం ఏమిటి? ఎవరి మాటా వినకుండా ముఖ్యమంత్రికి ఇంతటి మూర్ఖత్వమేమిటి?'' అని చింతకాయల ఆగ్రహం వ్యక్తం చేశారు. 

''చిన్నారుల జీవితాలతో ఆటలాడటం ముఖ్యమంత్రికి తగదు. ఎవరెంత చెప్పినా వినకుండా పరీక్షలు పెట్టే తీరుతామంటున్న ముఖ్యమంత్రి తీరుపై ప్రజలంతా ఆలోచన చేయాలి. అసెంబ్లీ సమావేశాలను, తిరుపతి ఉపఎన్నిక ప్రచారాన్ని కరోనా సాకుతో సీఎం రద్దు చేసుకున్నారు.  ముఖ్యమంత్రి తాను మాత్రం కరోనాకు భయపడుతూ, ఇతరులను మాత్రం దానికి బలిచేయాలని చూడటం ఏమిటి. జగన్ రెడ్డి కరోనాకు భయపడే ప్యాలెస్ నుంచి బయటకు రావడంలేదు. ఎటువంటి సమావేశాలు, సభలు, పర్యటనలు లేకుండా కలుగులో దాక్కున్నాడు'' అని అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. 

read more   విద్యార్థుల పాలిట కంసుడిగా మారిన జ‌గ‌న్‌రెడ్డి... నారా లోకేష్

''తన ప్రాణాల గురించి అంతలా ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి పిల్లల ప్రాణాలను మాత్రం లెక్కచేయకపోవడం ఎంతమాత్రం సరికాదు. కరోనా నిబంధనలు అనేవి ఎక్కడా అమలుకావడం లేదు. కళాశాలలు, పాఠశాలల్లో ఎవరూ వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. అనేకమంది ఉపాధ్యాయులు ఇప్పటికే కరోనాకు గురయ్యారని, దాదాపు 110మందివరకు చనిపోయినట్లు పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి'' అని  మాజీమంత్రి తెలిపారు. 

''అనేక రాష్ట్రాలు పరీక్షలు వాయిదా వేశాయని, ముఖ్యమంత్రి ఆ దిశగా ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు. విద్యాశాఖ మంత్రి పరీక్షల గురించి మాట్లాడుతూ... ఏం భయంలేదంటూ వెటకారంగా మాట్లాడుతున్నాడని... అటువంటి పనికిమాలిన, చేతగాని మంత్రులుండబట్టే ప్రజల పరిస్థితి ఇంత దారుణంగా తయారయ్యింది. ఉపాధ్యాయ సంఘాలు చంద్రబాబు హాయాంలో చీటికిమాటికీ గొడవలు చేసేవని, మరిప్పుడు ఆ సంఘాలన్నీ ఎందుకు ముఖ్యమంత్రి జగన్ ను నిలదీయడం లేదు?'' అని అయ్యన్నపాత్రుడు నిలదీశారు. 

''ఉపాధ్యాయులు చనిపోయినా, విద్యార్థులు కరోనాకు గురవుతున్నా, తల్లిదండ్రులు భయాందోళనకు గురువుతున్నా ఉపాధ్యాయ సంఘాలు ముఖ్యమంత్రిని కలిసి పరీక్షలు నిర్వహించవద్దని అడగకపోవడం ఏమిటి? ఉపాధ్యాయ సంఘాలు ఒక్కసారి ఆత్మపరీశీలన చేసుకోవాలి. కేబినెట్లో అనేకమంది సీనియర్ మంత్రులున్నారు. వారుకూడా ముఖ్యమంత్రికి చెప్పకపోతే ఎలా?'' అని అయ్యన్న వాపోయారు. 

''ఏదైనా జరిగితే జరగబోయే దారుణాలకు ముఖ్యమంత్రే బాధ్యుడవుతాడనే వాస్తవాన్ని ఆయనకు అర్థమయ్యేలా మంత్రులు ఎందుకు చెప్పలేకపోతున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఏదైనా జరిగితే ముఖ్యమంత్రే బాధ్యుడవుతాడని, అదేగానీ జరిగితే వారంతా ఈ మూర్ఖుడిని రోడ్డుపై నిలబెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి దీనిపై మూర్ఖత్వంతో  కాకుండా మంచి తనంతో ఆలోచించాలి'' అని మాజీమంత్రి అయ్యన్న హెచ్చరించారు.