మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ మధ్య నిజాలే మాట్లాడుతున్నారు.

మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ మధ్య నిజాలే మాట్లాడుతున్నారు. అదికూడా కుండబద్దలు కొట్టినట్లు ప్రభుత్వ విధానాలను తప్పుపడుతున్నారు. నర్సీపట్నంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ పనికిమాలిన విశాఖ ఉత్సవ్ కు కోట్లు తగలేస్తున్నట్లు మండిపడ్డారు. విశాఖ ఉత్సవ్ పేరుతో పర్యాటక శాఖ సుమారు రూ. 5 కోట్లు వ్యయం చేస్తోంది.

అదే సమయంలో రైతులకు ఎంతో ముఖ్యమైన, ఉపయోగపడే పాడి, మత్య్సపరిశ్రమ సదస్సులను చందాలు వేసుకుని నిర్వహిస్తుండటం దురదృష్టకరమన్నారు. ఎవరికీ ఉపయోగం లేని ఉత్సవాల నిర్వహణకు మాత్రం ప్రభుత్వం రూ. 5 కోట్ల ఎందుకు వ్యయం చేస్తోందో అర్ధం కావటం లేదన్నారు. అదే సమయంలో విశాఖలో వంద ఎకరాల డెయిరీ ఫామ్ స్ధలాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని చూస్తే రైతులు తరిమికొడతారంటూ అధికారులను హెచ్చరించారు. అంటే వందల కోట్ల విలువ చేసే డెయిరీ ఫామ్ స్ధలంపై ఎవరిదో పెద్దల కన్ను పడినట్లేఉంది.

మొన్నటికిమొన్న చంద్రన్నకానుకల పేరుతో ప్రభుత్వం ఏటా రూ. 900 కోట్లు వృధా చేస్తున్నట్లు చెప్పి సంచలనం రేపారు. అనంతరం, వుడా పరిధిలో భూసమీకరణ పేరుతో కొందరు పెద్దలతో ఉన్నతాధికారులు కుమ్మకై రూ. 600 కోట్ల భూకంభోణానికి తెరలేపారంటూ ధ్వజమెత్తారు. అంతేకాకుండా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి భూసమీకరణను నిలిపివేయించారు. ఇపుడేమో విశాఖ ఉత్సవ్ దండగమారి కార్యక్రమంటూ వేదికపై నుండే ప్రకటించటంతో అందరూ అవక్కాయ్యారు. ఇంతకీ అయ్యన్నపాత్రుడు ఎందుకిలా రెచ్చిపోతున్నారో.