కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై తానే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డి చెప్పారు. తాను ఉదయం 6.43 గంటలకు సమాచారం ఇచ్చానని, అర గంట తర్వాత పోలీసులు వచ్చారని ఆయన చెప్పారు. 

పోలీసులు వచ్చే వరకు కుటుంబ సభ్యులమంతా బయటే ఉన్నామని అవినాష్ రెడ్డి శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. వైఎస్ వివేకానంద రెడ్డి బాత్రూంలో పడి ఉన్నారని, అప్పుడు అక్కడ ఏ విధమైన లెటర్ లేదని ఆయన చెప్పారు. వివేకా హత్యపై తాము సిబిఐ దర్యాప్తు కోరుతున్నట్లు ఆయన తెలిపారు. 

వివేకా రాసినట్లు చెబుతున్న లేఖపై విచారణ జరగాలని ఆయన అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని అవినాష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ జరపకుండా రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వివేకా బావమరిది తనకు ఫోన్‌ చేసి చనిపోయిన విషయం చెప్పారని అన్నారు. తాము వెళ్లే సరికి వివేకానందరెడ్డి బాత్రూమ్‌లో పడి ఉన్నారని చెప్పారు. వెంటనే బయటకు వచ్చి పోలీసులకు ఫోన్‌ చేసి చెప్పామని అవినాష్‌రెడ్డి చెప్పారు.

వివేకాది అనుమానాస్పద మృతి అని ముందే చెప్పామని, విచారణ చేయకుండా శవరాజకీయాలు చేస్తున్నారని అన్నారు. వివేకానందరెడ్డి గురించి తెలిసిన వారెవరైనా.. ఆయనను హత్య చేసుంటారని ఊహించరని అన్నారు. వివేకా మరణం గురించి పూర్తి వివరాలు తెలియకుండా హత్య అని ఎలా చెప్తామని ఆయన అడిగారు. అందుకే విజ్ఞతతో వ్యవహరించామని అన్నారు.