తిరుపతి: ప్రముఖ ఆద్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా వున్న ఎనిమిదేళ్ల చిన్నారితో ఓ కామాంధుడు అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. అభం శుభం తెలియని చిన్నారిపై అత్యంత పాశంవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.  

వివరాల్లోకి వెళితే... చిత్తూరు జిల్లాలోని తిరుపతి పద్మావతినగర్ లో ఓ కుటుంబం నివాసముంటోంది. అయితే భార్యాభర్తలు పనిపై వెంకటగిరికి వెళుతూ తమ ఇద్దరు చిన్నారులను(కొడుకు, కూతురు) అదే కాలనీలో నివాసముండే అమ్మమ్మ వారింట్లో వదిలివెళ్లారు. దీంతో చిన్నారులిద్దరు అమ్మమ్మ వారి ఇంట్లో వుంటున్నా ఏదయినా పని వుంటే తమ ఇంటికి వెళ్లసాగారు. ఈ విషయాన్ని గమనించిన ఓ ఆటోడ్రైవర్ దారుణానికి పాల్పడ్డాడు. 

అమ్మమ్మ ఇంటినుండి ఒంటరిగా తన ఇంటికి బాలిక(8) వెళ్లగానే ఆమె వెంట ఆటో డ్రైవర్ మున్నా(37) కూడా వెళ్లాడు. ఈ క్రమంలో బాలికను బలవంతంగా బాత్రూంలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి అతి దారుణంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 

అయితే అదే సమయంలో ఇంటికి వచ్చిన బాలిక సోదరుడు ఏదో శబ్దం వస్తుందని బాత్రూంలోకి వెళ్లి చూడగా సోదరిపై జరుగుతున్న అఘాయిత్యాన్ని గమనించాడు. అతడు గట్టిగా అరవడంతో ఆటో డ్రైవర్ పారిపోయే ప్రయత్నం చేశాడు. కానీ స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ది చేశారు. 

బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆటోడ్రైవర్ ను అరెస్ట్ చేశారు. అతడిపై  పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే బాధిత బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.