అమరావతి:గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దళితులపై దాడులు తగ్గాయని ఏపీ రాష్ట్ర హోంశాఖ మంత్రి సుచరిత చెప్పారు. దళితులే తమ ప్రభుత్వానికి వెన్నెముక అని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

శుక్రవారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్ తో ఆమె మాట్లాడారు. 2019లో దళితులపై దాడుల కేసులు 1500 మంది చోటు చేసుకొన్నాయన్నారు. ఈ ఏడాది దళితులపై 1200 కేసులు మాత్రమే నమోదయ్యాయన్నారు. చిత్తూరులో దళితులపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఆధారాలు ఉంటే ఇవ్వాలని చంద్రబాబును డీజీపీ  కోరడంలో తప్పేం ఉందని ఆమె ప్రశ్నించారు.

also read:అత్యాచారాల్లో యూపీ తర్వాత ఏపీనే: మాజీ ఎంపీ హర్షకుమార్ సీరియస్ కామెంట్స్

దళితులపై దాడుల కేసుల విచారణకు స్పెషల్ డ్రైవ్ చేపడుతామని మంత్రి తెలిపారు. పెండింగ్ లో ఉన్న కేసుల గురించి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి తనకు ఫిర్యాదులు వస్తున్నాయని ఆమె చెప్పారు.ఈ కేసులను వెంటనే పరిష్కరించాలని ఆయా జిల్లాల ఎస్పీలను ఆదేశిస్తున్నట్టుగా మంత్రి వివరించారు.

పోలీసు వ్యవస్థలో ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితే జరగొచ్చు... అలాంటి సమయంలో డీజీపీ రాజీనామా కోరడం సరైంది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకొంటారా అని వ్యాఖ్యలు చేసిన చంద్రబాబునాయుడు క్షమాపణలు చెప్పారా  అని ఆమె ప్రశ్నించారు.