హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాప్రయత్నం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కు సహకరించడానికి విశాఖపట్నం పోలీసులు నిరాకరిస్తున్నారు. ఈ కేసును విచారించేందుకు ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఎన్ఐఎ రంగంలోకి దిగింది. 

జగన్ మీద హత్యాయత్నం కేసు విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అప్పీలుకు వెళ్లే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేసు విచారణను ఎన్ఐఎకు అప్పగించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం ఆ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. 

కేసు వివరాలను, ఆధారాలను తమకు అప్పగించాలని విశాఖపట్నం చేరుకున్న ఎన్ఐఎ అధికారులు సిట్ అధికారి నాగేశ్వర రావును కోరినట్లు సమాచారం. అయితే, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా వాటిని అప్పగించలేమని ఆయన ఎన్ఐఎ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. ఈ స్థితిలో ఎన్ఐఎ ఏం చేస్తుందనేది తెలియడం లేదు. 

ఇదిలావుంటే, శ్రీనివాస రావు జగన్ అభిమాని అని, ప్రచారం కోసం అతను జగన్ పై దాడి చేశాడని రెండు రోజుల క్రితం మీడియాతో చెప్పిన విశాఖ నగర పోలీసు కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా ప్రస్తుతం సెలవులో ఉన్నారు. ఈ కేసులో కీలకమైన అధికారి అయిన లడ్డా ఈ నెల 8వ తేదీ వరకు సెలవులో ఉంటారని తెలుస్తోంది. కేసు వివరాలను ఇవ్వబోమని సిట్ ఓ వైపు చెబుతుంటే, లడ్డా సెలవుపై వెళ్లడం చూస్తుంటే సందేహాలు తలెత్తుతున్నాయని అంటున్నారు. 

కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఎన్‌ఐఏ  జగన్ పై హత్యాయత్నం ఘటనకు సంబంధించి ఈనెల 1వతేదీన ఎఫ్‌ఐఆర్‌ను కూడా నమోదు చేసింది. కేంద్రం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) కె.లక్ష్మణ్‌ శుక్రవారం ఈ వివరాలను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు సమర్పించారు. 

ఎన్‌ఐఏ ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన నేపథ్యంలో జగన్‌పై హత్యాయత్నం ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తన దర్యాప్తును ఆపేయాల్సి ఉంటుంది. ఈ కేసులో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలతో కేసు డాక్యుమెంట్లను, రికార్డులన్నింటినీ చట్ట నిబంధనల మేరకు ఎన్‌ఐఏకు అప్పగించాల్సి ఉంటుంది. కానీ, సిట్ వాటిని అప్పగించేందుకు మెలిక పెడుతోంది.

సంబంధిత వార్తలు

 

జగన్ పై దాడి కేసు: హైకోర్టు ఆదేశాలతో వెంటనే కదిలిన హోంశాఖ

ఎన్ఐఎ అదుపులోకి శ్రీనివాస రావు: న్యాయవాది సలీం వెల్లడి

జగన్ పై దాడి కేసులో మలుపు: శ్రీనివాస రావు కస్టడీపై ఉత్కంఠ

జగన్ పై దాడి కేసు: హైకోర్టు ఆదేశాలతో వెంటనే కదిలిన హోంశాఖ

హైకోర్టు ఆదేశం: జగన్ మీద దాడి కేసులో కీలక మలుపు