అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలతో కేంద్రం దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ రంగంలోకి దిగింది. జగన్ పై దాడి కేసుకి సంబంధించి హైకోర్టు తీర్పును కేంద్రహోంశాఖ పరిశీలంచింది. అనంతరం కేంద్ర హోంశాఖ విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లోని సీఐఎస్ఎఫ్ అధికారులను దాడి ఘటనపై ఆరా తీసింది. 

కేసుకు సంబంధించి పూర్వపరాలపై చర్చించింది. ఆ తర్వాత సీఐఏస్ఎఫ్ అధికారుల ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యాలని నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీని ఆదేశించింది కేంద్ర హోంశాఖ. అలాగే విచారణను వేగవంతం చెయ్యాలని కూడా ఆదేశించింది. 

అటు హైకోర్టు, ఇటు కేంద్రప్రభుత్వం ఆదేశాలతో ఎన్ఐఏ నేరుగా రంగంలోకి దిగింది. ఎన్ఐఏ విచారణాధికారిగా విశాఖపట్నం అడిషనల్ ఎస్పీ షాజిద్ ఖాన్ ను నియమించింది. సీఐఎస్ఎఫ్ ఫిర్యాదుతో ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణను వేగవంతం చేసింది. 

మరోవైపు వైఎస్ జగన్ పై దాడికేసుకు సంబంధించి హైకోర్టు తీర్పు వెలువడక ముందే ఎన్ఐఏ నేరుగా రంగంలోకి దిగాలని భావించింది. విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో దాడిఘటనపై ఏపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేయిస్తుంటే..అటు వైసీపీ నేతలు మాత్రం థర్డ్ పార్టీ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టింది. 

ఈ నేపథ్యంలో  కేంద్ర హోంశాఖ జగన్ పై దాడి ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను నివేదిక రూపంలో ఇవ్వాలని  విశాఖపట్నం సిఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ గా విధులు నిర్వహిస్తున్న దినేష్ కుమార్ ను ఆదేశించింది. 

దినేష్ కుమార్ జగన్ పై దాడి ఘటన ఆరోజు ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది, సీసీ కెమెరాల పనితీరు సరిహద్దుల విషయం అన్ని అంశాలపై సంబంధించి ఒక పూర్తి నివేదిన తయారు చేసి కేంద్ర హోంశాఖకు సమర్పించారు. 

దినేష్ కుమార్ సమర్పించిన నివేదికను ఫిర్యాదుగా స్వీకరించిన కేంద్ర హోంశాఖ కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని 2018 డిసెంబర్ 31న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎన్ఐఏలో ఏవోగా విధులు నిర్వహిస్తున్న అడిషనల్ ఎస్పీ షాజిద్ ఖాన్ ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

తాజాగా హైకోర్టు ఆదేశాలతో ఎన్ఐఏ మరోసారి కేసు నమోదు చేసింది. అయితే ఇప్పటికే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో అదే ఎఫ్ఐఆర్ ప్రకారం విచారణ చేపడతారా లేక కోర్టు ఆదేశాలతో మరో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా అన్నది ఉత్కంఠ నెలకొంది. ఇకపోతే ఎన్ఐఏ మాత్రం కేసు విచారణను పరుగులుపెట్టించే అవకాశం ఉంది.