రాష్ట్ర మంత్రి పేర్నినాని కోసం నా ప్రాణాలైనా ఇస్తానని అంగన్‌వాడీ కార్యకర్త గుడివాడ పద్మావతి పేర్కొన్నారు. మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం ఘటన జరిగిన సందర్భంలో అక్కడే ఉన్న ఆమె నిందితుడిని పక్కకు లాగి, వెనుకకు పడిన మంత్రి పేర్ని నానిని లేవదీసే ప్రయత్నం చేశారు. 

రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)పై ఆదివారం ఉదయం హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. బడుగు నాగేశ్వరరావు అనే టీడీపీ కార్యకర్త పదునైన సన్నపాటి తాపీతో మంత్రిని రెండుసార్లు పొడవగా.. ఆయన తప్పించుకున్నారు. సరిగ్గా ఐదు నెలల క్రితంమంత్రి నాని ప్రధాన అనుచరుడైన మోకా భాస్కరరావును పట్టపగలే పొడిచి చంపారు. అదే తరహాలో మంత్రి నానిని కూడా మట్టుబెట్టేందుకు యత్నించడం కలకలం రేపింది. 

ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మంత్రి పేర్ని నాని తల్లి, మాజీ మంత్రి పేర్ని కృష్ణమూర్తి సతీమణి నాగేశ్వరమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె పెద్దకర్మ ఆదివారం మచిలీపట్నం మార్కెట్‌ యార్డు ఆవరణలో ఏర్పాటు చేశారు. మంత్రి నాని రామానాయుడు పేటలోని ఇంటివద్ద పూజా కార్యక్రమాలు ముగించుకుని ఉదయం 11.10 గంటల సమయంలో మార్కెట్‌ యార్డుకు బయలు దేరేందుకు బయటకు వచ్చారు. 

మంత్రి మెట్లు దిగుతుండగా.. వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలతో కలసి అక్కడ వేచివున్న టీడీపీ కార్యకర్త బడుగు నాగేశ్వరరావు మంత్రి కాళ్లకు నమస్కారం పెట్టేందుకు అన్నట్టుగా కిందకు వంగి.. వెంట తెచ్చుకున్న పదునైన తాపీతో మంత్రి పొత్తి కడుపులో బలంగా పొడిచాడు. ఆ సమయంలో మంత్రి కాస్త వెనక్కి జరగటం, తాపీ ఆయన ప్యాంట్‌పై ధరించిన లెదర్‌ బెల్ట్‌ బకెల్‌కు బలంగా తగలటంతో వంగిపోయింది.

వెంటనే నిందితుడు నాగేశ్వరరావు మంత్రి చొక్కా కాలర్‌ పట్టుకుని మరోసారి పొడిచేందుకు యత్నించాడు. రెండోసారి కడుపులో బలంగా పొడిచినప్పటికీ అప్పటికే తాపీ వంగిపోవడంతో మంత్రికి ఎలాంటి గాయం కాలేదు. ఆ సమయంలో బటన్స్‌ ఊడిపోయి మంత్రి చొక్కా పూర్తిగా చినిగిపోయింది. వెంటనే తేరుకున్న మంత్రి నిందితుణ్ణి వెనక్కి తోసేశారు. అయినా నిందితుడు పట్టు వదలకుండా మరోసారి దాడి చేసేందుకు యత్నించగా.. మంత్రి కిందపడిపోయారు. 
అక్కడే ఉన్న అంగన్‌వాడీ కార్యకర్త గుడివాడ పద్మావతి, పార్టీ నాయకుడు పరింకాయల విజయ్‌ మంత్రిని లేవదీయగా.. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు నిందితుణ్ణి అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. 

కాగా మంత్రిపై హత్యాయత్నానికి ఒడిగట్టిన బడుగు నాగేశ్వరరావు టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడైన మాజీమంత్రి కొల్లు రవీంద్రకు ప్రధాన అనుచరుడు. తెలుగు మహిళ విభాగం నగర శాఖ అధ్యక్షురాలు బడుగు ఉమాదేవి సోదరుడు. ఈ ఘటనపై చిలకలపూడి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. బందరు డీఎస్పీ రమేష్‌రెడ్డి నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు.