గుంటూరు: పత్రికా స్వేచ్ఛని హరించేలా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏపీని పాలిస్తున్నాడని... అందుకోసమే వైసిపి ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో కూడా తీసుకువచ్చిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఒకవైపు తమ అవినీతి, దందాలపై వార్త రాస్తే వైసిపి నాయకులు దాడులకు దిగుతున్నారని...మరోవైపు
 ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. 

''తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అనుచరులు జర్నలిస్ట్ వెంకట నారాయణ ఇంటి పై దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. జర్నలిస్టు ఇంటిని ధ్వంసం చేయడం  చూసి షాక్ కి గురయ్యాను. ఆ గూండాలు కుటుంబాన్ని పెట్రోల్‌తో పోసి సజీవ దహనం చేస్తామని బెదిరించారు. ఓం ప్రతాప్ మరణం,వైకాపా ఇసుక మాఫియాను బహిర్గతం చేసినందుకు ఇది ప్రతీకార చర్య. తమను తాము కాపాడుకునేందుకు  భయం తో ఆ కుటుంబం ఇంటి లోపలికి వెళ్లి తాళం వేసుకుంది'' అని అన్నారు. 

వీడియో

"

''పత్రికా స్వేచ్ఛకు వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం చేస్తున్న అనేక హింసాత్మక చర్యలకు ఇది మరో ఉదాహరణ. అధికార పార్టీ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందనటానికి రుజువు. ఇది చట్టవ్యతిరేకమైన చర్య జర్నలిస్టుల పై ఈ క్రూరమైన దాడులను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయ జోక్యం లేకుండా నేరస్థులను శిక్షించాలని...పత్రికా స్వేచ్ఛను కాపాడాలి''అని లోకేష్ డిమాండ్ చేశారు. 

చిత్తూరు జిల్లా సోమల మండలం కందూరులో  ఈ అరాచకం చోటుచేసుకుంది. ఓ పత్రిక విలేకరి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల అత్యంత భయానకంగా దాడికి పాల్పడ్డారు. జర్నలిస్ట్ ఇంట్లో ఉండే సామాన్లు బయటకు విసిరేసి ధ్వంసం చేశారు. 

ఓ వార్త వారికి అనుకూలంగా రాయలేదని అక్కసుతోనే జర్నలిస్ట్ ఇంటిపై దాడిచేసినట్లు తెలుస్తోంది. తనను పెట్రోల్ పోసి చంపేస్తామని బెదిరించారని... తన కుటుంబానికి కూడా అపాయం పొంచివుందని సదరు జర్నలిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.