ప్రకాశం: ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. అంతర్వేది రధం దగ్దం మొదలు ప్రతిరోజూ రాష్ట్రంలో ఏదో ఒకచోట దేవాలయాలపై, దేవతా విగ్రహాలపై దాడులు జరుగుతూనే వున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా తుర్లపాడులోని పురాతన వీరభద్రస్వామి దేవాలయంపై దాడికి పాల్పడ్డారు కొందరు గుర్తు తెలియని దుండగులు.

గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తుర్లపాడులోని వీరభద్రస్వామి దేవాలయ గోపురంపై వుండే కలశాన్ని ఆదివారం రాత్రి దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. 

ఎస్పీ ఆదేశాలతో స్థానిక పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గుప్త నిధుల కోసమే కలశాన్ని తొలగించారని పోలీసులు అనుమానిస్తున్నారు. కలశాన్ని ప్రతిష్టించే సమయంలో ఏవయినా నిధులు కూడా పెట్టి వుంటారన్న అనుమానంతో దుండగులు ఈ దాడికి పాల్పడి వుంటారన్నారు. ఇలా ఆలయ గోపురాన్ని ధ్వంసం చేసిన దుండగులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.