దారుణం.. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని తల్లిని చంపిన తనయుడు..
కన్న తల్లిని ఓ కుమారుడు కసాయిలా కడతేర్చాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని ఈ దారుణానికి ఒడిగట్టాడు. నిద్రిస్తున్న తల్లిని హతమర్చాడు. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో జరిగింది.
మద్యం తాగేందుకు తల్లి డబ్బులు ఇవ్వలేదని ఓ కుమారుడు దారుణానికి ఒడిగట్టాడు. నవమాసాలు మోసి కని, పెంచిన అమ్మా అని కూడా చూడకుండా.. ఆమెను క్రూరంగా హతమార్చాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని కంబదూరు గ్రామంలో చోటు చేసుకుంది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ బి.శ్రీనివాసులు మీడియాతో వెల్లడించిన వివరాల ప్రకారం.. కంబదూరు గ్రామంలో సుజాత తన కుమారుడైన ప్రణీత్ తో కలిసి జీవిస్తోంది. అయితే కొంత కాలం నుంచి ప్రణీత్ మద్యానికి, పలు దురలవాట్లకు బానిస అయ్యాడు. అయితే సోమావారం తన తల్లి దగ్గరికి వచ్చాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని కోరాడు.
కానీ దానికి సుజాత నిరాకరించారు. డబ్బులు ఇవ్వబోనని తేల్చి చెప్పారు. దీంతో అతడు కోపోద్రిక్తుడు అయ్యాడు. ఈ విషయంలో తల్లీ కుమారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో అతడు ఆవేశంతో ఇంటి నుంచి బయలుదేరాడు. కొంత సమయం తరువాత ఓ డబ్బాలో మూడు లీటర్ల పెట్రోల్ ను తీసుకొని వచ్చాడు.
ఆ సమయంలో తల్లి సుజాత మంచంపై నిద్రిస్తోంది. ఆమె నిద్రలో ఉన్నప్పుడే పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆమెకు తీవ్రగాయాలు కావడంతో బాధితురాలు అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కళ్యాణదుర్గం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. నిందితుడిని మంగళవారం అరెస్టు చేశారు.
గత నెల 4వ తేదీన నల్గొండ జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. చింతపల్లి మండలానికి చెందిన మల్లయ్య (90)కు ముగ్గురు కుమారులు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. అతడికి ప్రభుత్వం ఆసరా పెన్షన్ ఇస్తోంది. భార్య కొన్నేళ్ల కిందట చనిపోయింది. పిల్లలందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. మల్లయ్య కుమారుడు బుగ్గయ్య కొంత కాలం నుంచి మద్యానికి బానిస అయ్యాడు. దీంతో భార్య కూడా అతడిని వదిలేసి తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అతడు తండ్రితో కలిసే ఉంటున్నాడు.
ఆగస్టు 4వ తేదీన మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని బుగ్గయ్య తన తండ్రి మల్లయ్యను కోరాడు. ఈ విషయంలో తండ్రితో గొడవకు దిగాడు. మళ్లీ శుక్రవారం కూడా అలాగే వచ్చి గొడవ పడ్డాడు. పెన్షన్ డబ్బుల్లో నుంచి రూ.100 ఇవ్వాలని తండ్రిని అడిగాడు. డబ్బులు ఇవ్వబోనని తండ్రి తేల్చి చెప్పాడు. దీంతో బుగ్గయ్యకు కోపం వచ్చింది. క్షణికావేశంలో మల్లయ్య తలపై కర్రతో కొట్టాడు. దీంతో వృద్ధుడు తీవ్ర గాయాలతో అక్కడిక్కడే చనిపోయాడు.