ఆంధ్ర ప్రదేశ్ ప్రజలపై మరింత భారం మోపుతూ విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకున్న సీఎం జగన్, వైసిపి ప్రభుత్వంపై రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు. 

అమరావతి: ఇప్పటికే తెలంగాణ సర్కార్ కరెంట్ ఛార్జీలను భారీగా పెంచగా తాజాగా ఇదే బాటలో ఏపీ సర్కార్ కూడా పయనిస్తోంది. కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపేందుకు జగన్ సర్కార్ కూడా సిద్దమయ్యింది. ఇలా ఇరు తెలుగు రాష్ట్రాలో పోటీపడి మరీ కరెంట్ ఛార్జీలు పెంచుతూ సామాన్యుడిపై మరింత భారం మోపడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. తాజాగా ఏపీ టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (atchannaidu) ఏపీలో కరెంట్ ఛార్జీల పెంపు (electric charges hike)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. 

''చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (ys jagan)దే. ఆయన అసమర్ధ పాలనకు విద్యుత్ ఛార్జీల పెంపు నిదర్శనం. రాష్ట్ర ప్రజలు స్విచ్ వేయకుండానే కరెంట్ షాక్ తగిలే అద్భుత నిర్ణయం జగన్ రెడ్డి తీసుకున్నారు'' అని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేసారు. 

''వైసిపి అధికారంలోకి వచ్చాక ఇప్పటికే ఐదుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి రూ.11,600 కోట్ల భారం మోపిన జగన్ రెడ్డి మరోసారి ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపడం సిగ్గుచేటు. ప్రస్తుత ఛార్జీల పెంపుతో ప్రజలపై ఏడాదికి మరో రూ.4,400 కోట్ల భారం పడనుంది. జగన్ రెడ్డి తన చేతగానితనంతో ఒకవైపు విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ మరోవైపు ప్రజలపై పెనుభారం మోపుతున్నారు. పాలన చేతగాకపోతే దిగిపోవాలి. అంతేకానీ పన్నులు, ఛార్జీలు పెంచుతూ ప్రజలను దోచుకోకూడదు'' అని మండిపడ్డారు. 

''ప్రతిపక్ష నాయకుడిగా జగన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలను పూర్తిగా తగ్గించేస్తానని అనేక సభల్లో చెప్పారు. ఇప్పుడు అందుకు విరుద్దంగా ఛార్జీలు పెంచుకుంటూ పోతూ ప్రజలను నయవంచన చేస్తున్నాడు. జగన్ రెడ్డి పలాన దానిపై పన్నులు పెంచలేదని చెప్పగలడా? చెత్తపన్ను దగ్గర నుంచి నిత్యవసర వస్తువులు, విద్యుత్ ఛార్జీలు వరకు ప్రతీది పెంచుకుంటూ పోతున్నాడు'' అని ఆందోళన వ్యక్తం చేసారు. 

''తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వినియోగదారుడు గత సంవత్సరంలో వాడిన సరాసరి యూనిట్ల ఆధారంగా కేటగిరి నిర్ణయించడం జరిగింది. దీని వల్ల సంవత్సరం మొత్తం వినియోగదారుడు ఒకే కేటగిరిలో ఉండేవాడు. వినియోగదారుడు ఒక నెల ఎక్కువ కరెంటు వినియోగించినప్పటికీ భారం పడేది కాదు'' అని గుర్తుచేసారు.

''తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలను పెంచలేదు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే 2020-21లో (ఈ.ఆర్.సి ఆర్డర్ 10.02.2020) విద్యుత్ స్లాబులు మార్చి ప్రజలపై భారం మోపారు. అంతేకాకుండా గత ఏడాది సరాసరి వినియోగం ఆధారంగా ఉన్న కేటగిరైజేషన్ ను రద్దు చేసి నెలవారీ వాడకం ఆధారంగా కేటగిరిని నిర్ణయించే కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఈ విధానం ద్వారా వినియోగదారుడిపై, ప్రత్యేకించి పేద, దిగువ మధ్య తరగతి వినియోగదారులపై మోయలేని భారం పడింది'' అన్నారు.

''కేటగిరీలు మార్చి ప్రజలను దోచుకున్న జగన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా పేద, దిగువ మధ్యతరగతి వారిపై విద్యుత్ ఛార్జీలను 45 శాతం పెంచారు. ఇది అత్యంత దుర్మార్గం. దీనిపై తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది. పల్లెపల్లెకు జగన్ రెడ్డి దుర్మార్గాన్ని ప్రజలకు వివరించి చెప్పి ఛార్జీలు తగ్గించే వరకు జగన్ రెడ్డిని విడిచిపెట్టే సమస్యే లేదు'' అని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.