Asianet News TeluguAsianet News Telugu

అన్నింట్లో దోపిడియే... వ్యాక్సినేషన్‌లో అట్టడుగున ఏపీ: జగన్‌పై చంద్రబాబు విమర్శలు

పార్లమెంట్, అసెంబ్లీ ఇంఛార్జ్‌లు, జనరల్ బాడీ, ఇతర నేతలు, మండల అధ్యక్షులతో టీడీపీ అధినేత  చంద్రబాబు గురువారం జూమ్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతి పరాకాష్టకు చేరిందని ఆరోపించారు. 

tdp chief chandrababu naidu slams ap cm ys jagan over vaccination ksp
Author
Amaravati, First Published Jun 3, 2021, 8:52 PM IST

పార్లమెంట్, అసెంబ్లీ ఇంఛార్జ్‌లు, జనరల్ బాడీ, ఇతర నేతలు, మండల అధ్యక్షులతో టీడీపీ అధినేత  చంద్రబాబు గురువారం జూమ్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతి పరాకాష్టకు చేరిందని ఆరోపించారు. జగన్ రెడ్డిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని... రాష్ట్రంలో హోల్ సేల్ కరప్షన్ జరుగుతోందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. హౌసింగ్ విషయంలోనూ ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ లేదని... కాంట్రాక్టర్ల ద్వారా పెద్దఎత్తున లూటీ చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. 

నాడు-నేడులో కూడా వేల కోట్లు దోచేస్తున్నారని... ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్లను ముఖ్యమంత్రి స్టాలిన్ కొనసాగించి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని.. అన్న క్యాంటీన్ల మూసివేతపై జగన్ తీరును ప్రజల్లో ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మెడ్ టెక్ జోన్ ను నాశనం చేశారని.. వ్యాక్సిన్ కు కూడా కుల ముద్ర వేసి రాష్ట్రానికి చెడ్డపేరు తీసుకువచ్చారని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ రెడ్డి మాత్రం కోవాగ్జిన్ వేసుకుని.. తర్వాత కుల ముద్ర వేశాడంటూ ఎద్దేవా చేశారు.

ఏడాదికి 5 లక్షల ఇళ్లు నిర్మిస్తామని మేనిఫెస్టోలో చెప్పి.. రెండేళ్లలో ఒక్క ఇల్లు కూడా నిర్మించకుండా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు పేదల ఇళ్లను ధ్వంసం చేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్న 3 లక్షలకు పైగా ఇళ్లను పేదలకు ఇవ్వకుండా పాడుబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వైఫల్యాల నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకు జగన్ రోజుకో అంశాన్ని తెరపైకి తీసుకువస్తున్నారని మండిపడ్డారు. 

జగన్ ఉదాసీనత వల్ల కరోనా విస్తృతమైందని.. లోకల్ లాక్ డౌన్ లు పెట్టాలని సూచనలు చేశామని చంద్రబాబు గుర్తుచేశారు. సెకెండ్ వేవ్‌లో అనేక మంది మత్యువాత పడ్డారని.. పార్టీ పరంగా కరోనా విషయంలో ప్రజలను ఎడ్యుకేట్ చేశామని.. జగన్ కి అవగాహన లేకపోగా.. అహంకారంతో వ్యవహరించారని ఆరోపించారు. ఎంబీబీఎస్ చేసిన యువతి కరోనా బారిన పడి చనిపోయే పరిస్థితి వచ్చిందని.. కరోనా మూడో వేవ్ పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.  

వ్యాక్సిన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అట్టడుగున ఉందని.. గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక లో మనకన్నా వ్యాక్సినేషన్ వేగవంతంగా జరుగుతుంటే.. రాష్ట్రంలో మాత్రం నత్తనడకన సాగుతోందన్నారు. బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్ కేసులు పెరుగుతున్నాయని.. ఇంజెక్షన్లు దొరకని పరిస్థితి ఉందని చంద్రబాబు ఆరోపించారు. పోలవరం, హౌసింగ్ కు పదేపదే శంకుస్థాపనలు అంటూ జగన్ పక్కదారి పట్టించే మాటలు మాట్లాడుతున్నారని.. ఏ అంశంపై దృష్టి పెట్టాలో ఆ అంశంపై దృష్టిపెట్టకుండా ప్రజలను తప్పుదారి పట్టించే కార్యక్రమాలు చేస్తున్నారని టీడీపీ అధినేత ఎద్దేవా చేశారు. 

Also Read:వ్యాక్సిన్‌పై గ్లోబల్ టెండర్లు: ఆమోదం కేంద్రం చేతుల్లోనే.. ఒకే మాట మీద వుందాం, రాష్ట్రాల సీఎంలకు జగన్ లేఖ

జగన్‌ని ప్రశ్నించిన పత్రికలు, మీడియాపై రాజద్రోహం కేసులు పెడుతున్నారని.. కోర్టులు గట్టిగా మాట్లాడాయని, జాతీయ మీడియా కూడా జగన్ విధానాలను తప్పుబట్టాయన్నారు. వాస్తవాలకు వెలుగులోకి తీసుకువస్తున్న మీడియాపై ఆంక్షలు విధిస్తూ 2430 జీవో తీసుకువచ్చారు. ఇది పత్రికా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టుగా ఆయన అభివర్ణించారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించడం లేదని.. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఇవ్వాలని ప్రతిపక్షనేత డిమాండ్ చేశారు. 

పది, ఇంటర్ పరీక్షలపైనా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని.. ప్రజలు కూడా ఆగ్రహంతో ఉన్నారని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వ అక్రమాలపై ప్రశ్నిస్తే సంక్షేమ పథకాలు కట్ చేస్తామంటూ వైసీపీ నాయకులు బహిరంగంగానే బెదిరింపులకు దిగుతున్నారని... చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన అధికారులపై ప్రైవేటు కేసులు పెట్టాలని టీడీపీ అధినేత డిమాండ్ చేశారు.

కరోనా సెకండ్ వేవ్ లో టీడీపీ, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని చంద్రబాబు తెలిపారు. అత్యవసర వైద్య విభాగం ఏర్పాటు (SOS), జూమ్ ద్వారా టెలీ మెడిసిన్, ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు ఏర్పాటు, తెలుగు రాష్ట్రాల్లో 6 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఏర్పాటు, కరోనా బాధితులకు అండగా స్వచ్ఛంద విరాళాలు, క్షేత్రస్థాయిలో కోవిడ్ బాధితులకు మందుల సరఫరా, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. 

డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్ ను అభినందిస్తూ లేఖలు అందజేయాలని ప్రతిపక్షనేత డిమాండ్ చేశారు. పార్టీ శ్రేణులు కూడా కరోనా బాధితులకు అండగా నిలవాలని... ప్రజలతో అనుసంధానం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కరోనాతో ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలు, పార్టీ కార్యకర్తల వివరాలు సేకరించి ఎన్టీఆర్ ట్రస్ట్ కు అందజేయాలని ఆయన కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios