లోకేష్ వెళ్లేసరికే అమిత్ షా వద్ద పురంధేశ్వరి...: అచ్చెన్నాయుడు క్లారిటీ
కేంద్ర మంత్రి అమిత్ షా వద్దకు లోకేష్ ను పురంధేశ్వరి తీసుకెళ్ళారన్న ప్రచారంపై ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు క్లారిటీ ఇచ్చారు. అసలేం జరిగిందో ఆయన వివరించారు.
అమరావతి : తన తండ్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్, ఆ తర్వాత ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికే హోంమంత్రి అమిత్ షా ను లోకేష్ కలిసినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరి లోకేష్ ను వెంటపెట్టుకుని అమిత్ షా వద్దకు వెళ్లారని... రాజకీయాలపై వీరి మధ్య చర్చ జరిగిందన్న ప్రచారాన్ని అచ్చెన్నాయుడు కొట్టిపారేసారు. అమిత్ షా తో లోకేష్ భేటీ వెనుక ఎలాంటి రాజకీయాలు, ప్రణాళికలు లేవని ఏపీ టిడిపి అధ్యక్షుడు స్పష్టం చేసాడు.
అమిత్ షాను కలిసేందుకు లోకేష్ ఒక్కరే వెళ్లారని... అదే సమయంలో తెలుగు రాష్ట్రాల బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి, పురందేశ్వరి అక్కడ వున్నారని అచ్చెన్నాయుడు తెలిపారు. కావాలనే వైసిపి నాయకులు పురందేశ్వరి లోకేష్ ను వెంటపెట్టుకుని అమిత్ షా వద్దకు వెళ్లారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కలిసి వెళ్లకున్నా తెలుగు రాష్ట్రాల అధ్యక్షుల సమక్షంలోనే ఏపీలో సాగుతున్న వైసిపి అరాచక పాలన... సీఎం జగన్ కక్షసాధింపు చర్యల గురించి లోకేష్ కేంద్ర హోమంత్రికి వివరించారని అన్నారు.
ఏపీలో జరుగుతున్న పరిణామాల గురించి తనకంతా తెలుసని లోకేష్ తో అమిత్ షా చెప్పినట్లుగా అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కేంద్రమే చంద్రబాబు అరెస్ట్ చేయించిందన్న ప్రచారంపైనా అమిత్ షా స్పందించారని... ఈ అరెస్ట్ వెనక తమ ప్రమేయమేమీ లేదని లోకేష్ తో చెప్పారన్నారు.
Read More నా తల్లీ, భార్యలను కూడా వదిలిపెట్టడం లేదు..: అమిత్ షా తో లోకేష్ ఆవేదన
అయితే సీఎం జగన్ చంద్రబాబు అరెస్టుతో తనకు సంబంధం లేదని... కేంద్రమే అరెస్ట్ చేయించిందనే రీతిలో అబద్దాలు చెబుతున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్ గురించి తనకు తెలియదని జగన్ దద్దమ్మ మాటలను ప్రజలు నమ్మబోరని అన్నారు. రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు అరెస్ట్ ను కేంద్రంపై నెట్టాలని జగన్ చూస్తున్నారని అన్నారు. స్వయంగా కేంద్రం హోంమంత్రి అమిత్ షా నే చంద్రబాబును మేము అరెస్ట్ చేయించలేదని అంటున్నారు... ఇప్పుడు జగన్ ఏం సమాధానం చెబుతారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
గతంలో అక్రమాస్తుల కేసులో జగన్ అరెస్టయితే ఆయన కుటుంబసభ్యులు తప్ప ప్రజలెవ్వరూ బయటకు రాలేదని అచ్చెన్న పేర్కొన్నారు. అంటే జగన్ తప్పు చేసాడని ప్రజలు నమ్మారు కాబట్టే బయటకు రాలేదన్నారు. కానీ చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసారని ప్రజలు నమ్ముతున్నారు... అందువల్లే రోడ్లపైకి వచ్చి నిరసన చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత టిడిపికి ప్రజల మద్దతు మరింత పెరిగిందన్నారు. చంద్రబాబును జైల్లో పెట్టడం ద్వారా
రాజకీయ లబ్ది పొందాలనుకున్న జగన్ వ్యూహం బూమరాంగ్ అయ్యింది... అందువల్లే ఇప్పుడు మాట మారుస్తున్నాడని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.