అమరావతి:టీడీపీ ఏపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని నియమించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉత్తరాంధ్రకు చెందిన కళా వెంకట్రావు ఈ పదవిలో ఉన్నారు. సంస్థాగత ఎన్నికలు కొనసాగుతున్నందున  కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. 

ఈఎస్ఐ స్కాంలో అరెస్టైన అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఇటీవలనే అచ్చెన్నాయుడు బెయిల్ పై విడుదలయ్యారు.

సంస్థాగత ఎన్నికల ప్రక్రియను టీడీపీ దాదాపుగా పూర్తి చేసింది. మండలస్థాయి వరకు సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తైంది. త్వరలోనే లోక్ సభ నియోజకవర్గాల వారీగా కమిటీలను టీడీపీ నియమించనుంది.

2019 ఎన్నికల్లో టీడీపీ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది.దీంతో పలువురు నేతలు పార్టీని వీడారు. పార్టీని వీడిన నేతల స్థానాల్లో కొత్తవారిని ఇంఛార్జీలుగా నియమించనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్ నియోజకవర్గాలకు కూడ కొత్తవారిని ఇంఛార్జీలుగా నియమించనున్నారు. 

పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కమిటీలను కూడ వారం పది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.  ఈ కమిటీల తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ అనుబంధ కమిటీల ప్రక్రియను కూడ పూర్తి చేయనున్నారు.

పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలనే పార్టీలో ఎక్కువ మంది సూచించినట్టుగా సమాచారం.

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పార్టీకి చెందిన కీలక నేతలపై కేసులు పెట్టింది. రానున్న రోజుల్లో పార్టీని నడపడం అంతా ఆషామాషీ వ్యవహరం కాదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ తరుణంలో పార్టీ బాధ్యతలను తన భుజాలపై వేసుకొనేందుకు అచ్చెన్నాయుడు కూడ సానుకూలంగా ఉన్నారనే ప్రచారం సాగింది. ఇదే విషయమై మూడు మాసాల క్రితం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అచ్చెన్నాయుడు టీడీపీకి కొత్త బాస్ అంటూ ప్రచారం సాగిన విషయం తెలిసిందే.

అయితే అదే సమయంలలో ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు అరెస్టైన విషయం తెలిసిందే. సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత అచ్చెన్నాయుడును కొత్త అధ్యక్షుడిగా నియమించే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం బీసీ సామాజిక వర్గానికి చెందిన కళా వెంకట్రావు పార్టీ అధ్యక్ష పదవిలో ఉన్నారు. కళా వెంకట్రావుకు సౌమ్యుడిగా పేరుంది.మరో వైపు అచ్చెన్నాయుడు దూకుడు స్వభావం కలవాడు. ప్రస్తుతం రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో అచ్చెన్నాయుడు లాంటి నేతకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే క్యాడర్ లో ఉత్సాహం నెలకొనే అవకాశాలు ఉన్నాయని కొందరు పార్టీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు.