మొత్తానికి చంద్రబాబునాయుడు మూడున్నరేళ్ళ తర్వాత కళ్ళు తెరిచారు. కార్పొరేట్ కళాశాలల్లో అసలేం జరుగుతోందో తెలుసుకునేందుకు కార్పొరేట్ విద్యాసంస్ధల యాజమాన్యాలు, విద్యా సంస్ధల ఉన్నతాధికారులతో సోమవారం సమావేశమవుతున్నారు. మూడున్నరేళ్ళుగా కార్పొరేట్ విద్యాసంస్ధల్లో ప్రధానంగా నారాయణ, శ్రీ చైతన్య సంస్ధల్లో విద్యార్ధులు పిట్టల్లా రాలిపోతున్నారు. చదువుల విషయంలో తీవ్ర ఒత్తిడిని తట్టుకోలేకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నది వాస్తవం.

ఎప్పుడు విద్యార్ధుల ఆత్మహత్య జరిగినా మీడియా, విద్యార్ధి సంఘాలు ఎంత గోల పెట్టినా అవేవీ చంద్రబాబు దృష్టిలో పడలేదు. దృష్టిలో పడలేదనేకన్నా పట్టించుకోలేదంటే సబబుగా ఉంటుంది. అందుకు కారణాలేంటి ? ఇంకేముంది, కళాశాలల యాజమాన్యాలు రెండూ టిడిపి నేతలవే కాబట్టి.

అందులోనూ నారాయణ విద్యాసంస్ధ యజమాని, మంత్రి నారాయణకు, చంద్రబాబుకు మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. అందుకనే కార్పొరేట్ విద్యాసంస్ధల్లో ఎన్ని దారుణాలు జరుగుతున్నా చంద్రబాబు పట్టించుకోలేదు. విద్యాసంస్ధలకు స్వయంగా పాలకులే యాజమాన్యాలైనపుడు అధికారులు మాత్రం ఎవరి మీద చర్యలు తీసుకుంటారు?

అందుకనే వందల సంఖ్యలో విద్యాసంస్ధల హాస్టళ్ళను ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నా యాజమాన్యాలపై ఎటువంటి చర్యలు లేవు. విద్యార్ధుల ఆత్మహత్యలు, పారిపోవడాలు ఎక్కువైపోవటంతోనే ప్రభుత్వంపై అన్నీ వైపుల నుండి ఒత్తిడి పెరిగిపోతోంది. మరీ గడచిన వారం రోజుల్లోనే కనీసం ఐదుగురు విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోవటం, ఓ విద్యార్ధిని నారాయణ విద్యాసంస్ధలో పరిస్ధితులపై ఏకంగా లేఖ రాసి పారిపోవటం సంచలనంగా మారింది. దాంతో తప్పని పరిస్ధితిల్లో చంద్రబాబు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

కార్పొరేట్ విద్యాసంస్ధల్లో పరిస్ధితులు చేజారి పోయాయి కాబట్టే మిత్రపక్షం భారతీయ జనతా పార్టీకి అనుబంధ విద్యార్ధి సంఘం ఏబివిపి రెండు తెలుగు రాష్ట్రాల్లోను బంద్ కు పిలుపునివ్వటం గమనార్హం. ఇదే పరిస్ధితిలో అధికారంలో టిడిపి కాకుండా ఇంకేదన్నా ప్రభుత్వం ఉండివుంటే తెమ్ముళ్ళు కానీ టిడిపికి మద్దతుగా నిలిచే మీడియా కానీ రచ్చ రచ్చ చేసేదనటంలో ఎవరికీ అనుమానాలు లేవు.