తిరుపతి: కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం నిలిపివేసింది టీటీడీ. స్వామివారికి ఏకాంత సేవలను నిర్వహిస్తున్నారు అర్చకులు. దీంతో తిరుమలలో 128 ఏళ్ల నాటి వాతావరణం కన్పిస్తోందని స్థానికులు చెబుతున్నారు. మరో వైపు భక్తుల రాకపోకలు లేకపోవడంతో పాటు నిశ్శబ్ద వాతావరణం నెలకొనడంతో  వన్యమృగాలు తిరుమల వీధుల్లో సంచరిస్తున్నాయి. 

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా తిరుమల శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసింది టీటీడీ. లాక్ డౌన్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలకు అనుగుణంగా భక్తులకు శ్రీవారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు అధికారులు.

also read:నర్సీపట్నం డాక్టర్ సస్పెన్షన్ పై చంద్రబాబు సీరియస్... జగన్ కు ఘాటు లేఖ

రెండు వారాలుగా తిరుమల శ్రీవారి దర్శనం భక్తులకు నిలిచిపోయింది. దీంతో తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డుతో పాటు తిరుమలలో వీధుల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొన్న కారణంగా వన్య మృగాలు తిరుమల వీధుల్లో సంచరిస్తున్నాయి. శేషాచలం అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న కళ్యాణ వేదిక, శ్రీవారి సేవ సదన్ వద్ద చిరుతపులి సంచరించింది. చిరుతతో పాటు ఎలుగు బంటి కూడ సంచరించినట్టుగా  అటవీశాఖ అదికారులు గుర్తించారు.

చిరుతపులి, ఎలుగుబంటి తిరుమల వీధుల్లో సంచరించిన దృశ్యాలను సీసీకెమెరాలు రికార్డు చేశాయి.బాలాజీ నగర్, ఈస్ట్ బాలాజీ నగర్ లో చిరుతపులి, అడవి పందులు, దుప్పులు సంచరిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు.ఇక పాపవినాశనం మార్గంలో ఏనుగులు సంచరిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు.

లాక్ డౌన్ కారణంగా రెండు ఘాట్ రోడ్లలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నాలుగు రోజుల క్రితం రెండు ఘాట్ రోడ్లను లింక్ చేసే రోడ్డులో చిరుతపులి కన్పించింది. సాయంత్రం పూట జనం ఎవరూ కూడ బయట తిరగకూడదని అధికారులు ఆంక్షలు విధించారు.

తిరుమలకు భక్తు రాక పెరగడంతో వన్యమృగాల రాక తగ్గిపోయింది. 1900 తర్వాత  తిరుమలకు భక్తు రాక క్రమంగా పెరుగుతూ వచ్చిందని రికార్డులు చెబుతున్నాయి.రెండు వారాలుగా ఆలయాన్ని మూసివేయడంతో పాటు ఘాట్ రోడ్లపై రాకపోకలు నిషేధించడంతో వన్యప్రాణులు యధేచ్ఛగా తిరుగుతున్నాయి.128 ఏళ్ల క్రితం ఒక్కసారి తిరుమల ఆలయాన్ని రెండు రోజుల పాటు ఆలయాన్ని మూసివేసిన సమయంలో కూడ ఇదే రకమైన పరిస్థితి నెలకొందని  చెబుతున్నారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విషయంలో తీసుకొన్న నిర్ణయాన్ని బట్టి తిరుమల శ్రీవారి తెరిచే విషయమై  టీటీడీ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.