అమరావతి: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రాణాలకు తెగించి మరీ వైద్యసేవలు అందిస్తున్న డాక్టర్ల మనోధైర్యం దెబ్బతినేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైద్యుల రక్షణ గురించి ప్రశ్నించిన డాక్టర్  సుధాకర్ రావు ను సస్పెండ్ చేయడంపై స్పందిస్తూ ఆ సస్పెన్షన్ ను వెంటనే వెనక్కి తీసుకుని విధుల్లోకి తీసుకోవాలని జగన్ ప్రభుత్వానికి చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్ కు ఓ బహిరంగ లేఖ రాశారు. 

చంద్రబాబు లేఖ యధావిధిగా 

గౌ. శ్రీ జగన్మోహన్ రెడ్డిగారికి,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి,
అమరావతి.

విషయం: డాక్టర్ సుధాకర్ రావు సస్పెన్షన్-ఇతర వైద్యులు, ఆరోగ్య సిబ్బందిలో దెబ్బతిన్న మనోధైర్యం- తక్షణమే సస్పెన్షన్ ఎత్తివేత గురించి 

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం  ప్రభుత్వ వైద్యశాలలో ఎనస్తీషియా డాక్టర్ సుధాకర్ రావును సస్పెండ్ చేయడం సరైన చర్యకాదు. పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్(పిపిఈ)లు అందుబాటులో లేక అనేకమంది డాక్టర్లు, వైద్య సిబ్బంది పడుతున్న ఆవేదననే సుధాకర్ రావు వెల్లడించారు. మాస్క్ లు, గ్లౌజులు అడిగిన డాక్టర్ ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం మన దేశంలోనే  కాదు, ప్రపంచంలోనే ఎక్కడా లేదు. కరోనా రోగులకు చికిత్స అందిస్తూ ఇప్పటికే అనేకమంది డాక్టర్లు, వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 

అనంతపురం జిల్లాలో కూడా చికిత్స చేసిన నలుగురు వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో డాక్టర్ సుధాకర్ రావు వ్యాఖ్యలను సానుకూలంగా చూడాలే తప్ప, వాటిపై ప్రతికూల చర్యలు సబబు కాదు.ప్రాణాలు ఫణంగా పెట్టి కరోనా రోగులకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బందికి కావాల్సిన వ్యక్తిగత రక్షణ ఉపకరణా(పిపిఈ)లు అందించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ఒక వైద్యునిగా తన బాధ్యతలో భాగంగానే డాక్టర్ సుధాకర్ రావు, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేశారే తప్ప, ఆయన వ్యాఖ్యలను క్రమశిక్షణా ఉల్లంఘన కింద పరిగణించడం సబబుకాదు. 

కరోనా విపత్తు రెండవ ప్రపంచ యుద్దం సృష్టించిన సంక్షోభం కన్నా పెను విధ్వంసాన్ని సృష్టిస్తోందని వివిధ దేశాధినేతలే అంటున్నారు. అత్యంత ప్రమాదకరమైన కోవిడ్ వైరస్ శరవేగంగా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి సోకింది, వేలాదిమందిని బలిగొంది. కరోనా బారినబడి 209దేశాలు తల్లడిల్లుతున్నాయి, యుద్దప్రాతిపదికన వైరస్ నియంత్రణా చర్యలను ఆయా ప్రభుత్వాలు చేపడ్తున్నాయి. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్ల( వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పోలీస్, శానిటేషన్ సిబ్బంది)కి ఎన్ 95మాస్క్ లు, గ్లౌజులు, ఫుల్ స్లీవ్ గౌన్లు, ఐ షీల్డ్ గాగుల్స్  లేకపోవడం దినదినం  ప్రాణగండంగా మారింది. 

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో సాధ్యమైనన్ని రక్షణ ఉపకరణాలు( పిపిఈలు), ఫ్రంట్ లైన్ వారియర్లకు అందించడంపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలే తప్ప ఈ విధమైన సస్పెన్షన్ లు ప్రస్తుత సమస్యకు పరిష్కారం కాదనేది మీ దృష్టికి తెస్తున్నాను. కాబట్టి తక్షణమే డాక్టర్ సుధాకర్ రావుపై సస్పెన్షన్ చర్యలు ఎత్తివేయాలని, నర్సీపట్నం వైద్యశాలతో సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆసుపత్రులలో వైద్యులకు, ఆరోగ్యసిబ్బందికి కావాల్సిన వ్యక్తిగత రక్షణ పరికరాలను అందజేయడం ద్వారా వారిలో మనోధైర్యం పెంచడంతో పాటు, బాధిత రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాము.


                                                                                                                                                                                                                                   ధన్యవాదాలు,
                                                                                                                                                                                                                     (నారా చంద్రబాబు నాయుడు) 
                                                                                                                                                                                                                    శాసన సభ ప్రధాన ప్రతిపక్ష నేత.