దేశమాత సేవలో తెలుగు జవాను నేలకొరిగాడు. జమ్మూ–కశ్మీర్‌ ఆర్మీలో జవానుగా సేవలందిస్తున్న చిత్తూరు జిల్లాకు చెందిన రెడ్డప్పనాయుడు (38) చలి తీవ్రత తట్టుకోలేక అమరుడయ్యాడు.

చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీ గడ్డకిందపల్లి గ్రామానికి చెందిన మంచు రెడ్డప్పనాయుడు, శాంతమ్మ దంపతుల కుమారుడు రెడ్డప్పనాయుడు 14 ఏళ్ల క్రితం భారత సైన్యంలో చేరారు.

నాటి నుంచి మిలటరీలో జవానుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం జమ్మూ–కశ్మీర్‌లో చలి తీవ్రత అధికంగా ఉండడంతో రెడ్డప్పనాయుడు తట్టుకోలేక తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. సహచరులు ప్రథమ చికిత్సను అందించారు. 

రెడ్డప్పనాయుడి పరిస్థితి మరింత క్షీణించడంతో ఉన్నతాధికారులు హెలీకాప్టర్‌ ద్వారా ఆస్పత్రికి తరలించే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణవార్తను భారత సైన్యం కుటుంబసభ్యులకు తెలియజేసింది.

రెడ్డప్పనాయుడుకు భార్య రెడ్డమ్మ, కుమారుడు సాత్విక్, కుమార్తె నిశిత ఉన్నారు. 14 ఏళ్లుగా ఆర్మీలో సేవలందించిన రెడ్డప్పనాయుడుకు ఇటీవల పదోన్నతి లభించడంతో ఆయన ఎంతో సంతోషంగా వున్నారు.

ఇలాంటి సమయంలో రెడ్డప్పనాయుడు మరణించడాన్ని ఆయన కుటుంబసభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మంగళవారం రెడ్డప్పనాయుడు మృతదేహం స్వగ్రామానికి చేరుకోనుందని కుటుంబ సభ్యులు తెలిపారు.