Asianet News TeluguAsianet News Telugu

ఫిరాయింపులే చంద్రబాబు కొంప ముంచుతాయా?

ఎన్నికలు వచ్చే సమయానికి ఇంకెన్ని గొంతులు చంద్రబాబుకు వ్యతిరేకంగా లేస్తాయో? ఆ గొంతులన్నీ ఎవరితో చేతులు కలుపుతాయో చూడాలి?

Are defectors will damage naidu

చంద్రబాబునాయుడుపై టిడిపిలో ఇంత వ్యతిరేకత ఉన్నదా? ఫిరాయంపు ఎంఎల్ఏలే చంద్రబాబు కొంప ముంచేట్లున్నారు. మంత్రివర్గ కూర్పు నేపధ్యంలో చంద్రబాబుపై నేతల్లోని వ్యతిరేకత ఒక్కసారిగా బయటపడింది. పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే వ్యతిరేకత ఇంకా చాలా ఎక్కువున్నట్లే అనిపిస్తోంది. నేతల్లో అంతర్గతంగా ఉన్న వ్యతిరేకతతో పోల్చుకుంటే బయటపడింది చాలా తక్కువని సమాచారం. మొదటి నుండి టిడిపిలో క్రమశిక్షణ ఉన్నమాట వాస్తవం. అయితే, ఎన్టిఆర్ ను పదవి దింపటం, తదితర పరిణామాల్లో క్రమశిక్షణ తప్పిందన్నదీ వాస్తవమే. పార్టీలో క్రమశిక్షణ ఎన్టీఆర్తోనే పోయిందని బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్లు చెబుతున్న మాట.

పార్టీలోని సీనియర్లందరూ అడుగుతున్నదొకటే. ఫిరాయింపులకు, కాంగ్రెస్ నుండి వచ్చిన వారికి మంత్రి పదవులు ఎలా కట్టబెడతారని? పార్టీ సిద్ధాంతలకు వ్యతిరేకంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఏనాడూ చంద్రబాబు వైఖరిపై మాట్లాడే సాహసం కూడా చేయని వారు ఇపుడు ఏకంగా మీడియా సమావేశాల్లోనే మాట్లాడుతున్నారు. అంటే వీరందరికీ ఎప్పటి నుండో చంద్రబాబుపై మండుతోంది. అవకాశం రాక ఇంతకాలం మౌనంగా ఉన్నారు.

మంత్రి పదవులు కోల్పోయిన వారు, మంత్రి పదవులు ఆశించి భంగపడిన వారు, ఫిరాయింపులకు మంత్రిపదవులు ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తున్న వారు ..ఇలా ఒకటేమిటి వివిధ వర్గాలు చంద్రబాబును బాహాటంగానే తప్పుపడుతున్నారు. విచిత్రమేమిటంటే ఫిరాయింపు ఎంఎల్ఏలు కూడా చంద్రబాబు తమను మోసం చేసారనే అంటున్నారట. చంద్రబాబు విధానాలు చూస్తుంటే పార్టీలోని ప్రతీ నేత, కార్యకర్త ఆవేదన చెందుతున్నారని బుచ్చయ్య లాంటి వాళ్ళు చెబుతున్నదాంట్లో తప్పేమీ లేదు. బుచ్చయ్య ఒకరే కాదు కాగిత వెంకట్రావు, గౌతు శివాజి, బండారు సత్యనారాయణ మూర్తి లాంటి అనేకమంది చంద్రబాబు వైఖరిపై ఉడికిపోతున్నారు.

టిడిపి పెట్టినప్పటి నుండి ఇంత బాహాటంగా అధినేత వైఖరిపై తిరుగుబాటు చేయటం ఇదే మొదటిసారి. గతంలో పార్టీలో ఇమడలేమనుకున్న వాళ్ళు బయటకు వచ్చేసిన సందర్భాలున్నాయి. కానీ పార్టీలోనే ఉంటూ అధినేత నిర్ణయాన్ని తప్పు పట్టటం మాత్రం ఇదే మొదలు. ఎన్నికలు వచ్చే సమయానికి ఇంకెన్ని గొంతులు చంద్రబాబుకు వ్యతిరేకంగా లేస్తాయో? ఆ గొంతులన్నీ ఎవరితో చేతులు కలుపుతాయో చూడాలి? ఏమంటారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios