Asianet News TeluguAsianet News Telugu

దెబ్బకు తిరుమలపై వెనక్కి తగ్గిన పురావస్తు శాఖ

తీవ్రమైన వ్యతిరేకత రావడంతో తిరుమల చారిత్రక కట్టడాలను తీసుకునే విషయంలో కేంద్ర పురావస్తు శాఖ వెనక్కి తగ్గింది.

Archeology dept will withdraw orders on Tirumala

తిరుపతి: తీవ్రమైన వ్యతిరేకత రావడంతో తిరుమల చారిత్రక కట్టడాలను తీసుకునే విషయంలో కేంద్ర పురావస్తు శాఖ వెనక్కి తగ్గింది. సమాచార లోపం వల్ల టీటీడీకి ఆ లేఖ పంపారని వివరణ ఇస్తూ తిరుమల ఈవో సింఘాల్ కు పురావస్తు శాఖ లేఖ పంపింది. అరగంటలో ఉత్తర్వులు వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేసింది.

పురావస్తు శాఖ రాసిన లేఖపై సింఘాల్ తీవ్రంగా ప్రతిస్పందించారు. శ్రీవారి ఆలయాన్ని పురావస్తు శాఖకు అప్పగించే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు. పరిశీలనకు వచ్చే అధికారులను అనుమతించబోమని అన్నారు. పురావస్తు శాఖ అధికారులకు ఏ విధమైన సమాచారం కూడా ఇవ్వబోమని అన్నారు. పురావస్తు శాఖ రాసిన లేఖపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.  

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిధిలో ఉన్న తిరుమల ఆలయాలన్నింటినీ తన చేతిలోకి తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదిపినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆలయాలన్నింటినీ రక్షిత కట్టడాల పరిధిలో చేర్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

తొలుత వచ్చిన వార్తాకథనం సారాంశం ఇలా ఉంది - తిరుమలలో ఉన్న అలయాలను అన్నింటినీ పురావస్తు శాఖ పరిధిలోకి తెస్తారు. ఆలయాలను సందర్శించి ఫొటోలు తీసుకునేందుకు కేంద్ర పురావస్తు శాఖ అధికారులకు సహకరించాలని కేంద్రం రాష్ట్రానికి ఓ లేఖను పంపించింది.

వాటిని రక్షిత కట్టడాలుగా ప్రకటిస్తే టీటీడీ కేంద్రం పరిధిలోకి వెళ్లే అవకాశం ఉంది. కేంద్ర ఆదేశాల మేరకు అమరావతి సర్కిల్ టీటీడీకి లేఖను పంపినట్లు కూడా తెలుస్తోంది. 

తిరుమలలో ప్రాచీన కట్టడాలకు రక్షణ కరువైందని, ప్రాచీన కట్టడాలను తొలగించి కొత్త నిర్మాణాలు చేపడుతున్నారని పురావస్తు శాఖకు ఫిర్యాదులు అందినట్లు చెబుతున్నారు. భక్తులు ఇచ్చిన కానుకలను కూడా సరిగా భద్రపరచడం లేదనే ఆరోపణలు వస్తున్నాయని అంటున్నారు. 

ప్రాచీన కాలంలో రాజులు ఇచ్చిన కానుకలకు భద్రత లేదని పురావస్తు శాఖ చెబుతోంది. ఈ దృష్ట్యా పురావస్తు శాఖ అధికారులు త్వరలో తిరుమల సందర్శించే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. టీటీడీ నుంచి జాబితా అందిన తర్వాత వారు వస్తారని సమాచారం. ఆ తర్వాత కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. 

కేంద్ర పురావస్తు శాఖ తన ఆధీనంలోకి తీసుకుంటే తిరుమల ఆలయాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైన అధికారం కూడా ఉండదు. ఆలయాలకు వచ్చే ఆదాయాన్ని కూడా కేంద్రం తీసుకుంటుందని అంటున్నారు. టీటీడీ బోర్డు నియామక వ్యవహారం కూడా కేంద్రం చేతిలోకి వెళ్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios