ఏపీలో రేపటి నుండి పెరగనున్న ఆర్టీసీ బస్సు చార్జీలు: డీజీల్ సెస్ పేరుతో భారం
ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు చార్జీలు రేపటి నుండి పెరగనున్నాయి. టికెట్ ధరలు పెంచకుండా డీజీల్ సెస్ పేరుతో ప్రయాణీకులపై ఆర్టీసీ భారం మోపనుంది. డీజీల్ సెస్ ద్వారా రూ. 720 కోట్లు ఆర్టీసీకి ఆదాయం దక్కనుంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుండి బస్సు చార్జీలు పెరగనున్నాయి. అయితే టికెట్ రేటు పెంచకుండా Diesel Cess పేరుతో ప్రయాణీకులపై APSRTCభారం వేయనుంది. 2019 లో రాష్ట్రంలో బస్సు చార్జీలను పెంచిన సమయంలో డీజీల్ ధర లీటరుకు 67 రూపాయాలుండేదని ఆర్టీసీ ఎండీ Dwaraka Tirumala Rao చెప్పారు. బుధవారం నాడు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రస్తుతం డీజీల్ ధర రూ. 107 రూపాయాలకు పెరిగిందని చెప్పారు. డీజీల్ సెస్ పేరుతో చార్జీలను పెంచనున్నారని ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు తెలిపారు. పల్లె వెలుగు బస్సులకు డీజీల్ సెస్ రెండు రూపాయాలు, ఎక్స్‌ప్రెస్ బస్సులకు 5 రూపాయాలు, ఏసీ బస్సులకు 10 రూపాయాలు పెంచనున్నారు. అయితే కిలోమీటరుకు గతంలో ఏ మేరకు Ticket ధరను వసూలు చేస్తున్నారో దానికి అదనంగా ఈ చార్జీలను వసూలు చేస్తారు. మరో వైపు పల్లె వెలుగు బస్సు కనీస చార్జీ రూ. 10 చేశారు.
Corona తో ఆర్టీసీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. డీజీల్ ధరలు పెరగడంతో ఆర్టీసీ తీవ్రమైన నష్టాల్లోకి నెట్టివేయబడిందన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో డీజీల్ సెస్ వసూలు చేయాలని నిర్ణయం తీసుకొన్నామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు చెప్పారు. డీజీల్ సెస్ వేయడం ద్వారా ప్రతి ఏటా ఆర్టీసీకి రూ. 720 కోట్లు వస్తుందన్ని ఆర్టీసీ ఎండీ చెప్పారు. డీజీల్ ధరలు పెరగడం వల్ల ప్రతి ఏటా తమకు రూ. 1300 కోట్లు ఆదనపు భారం పడుతుందన్నారు. కానీ డీజీల్ సెస్ పెంపు ద్వారా కూడా తమకు అంత మేర ఆదాయం రావడం లేదని ఆర్టీసీ ఎండి తెలిపారు.బస్ టికెట్ ధరలను 32 శాతం పెంచితే ఆర్టీసీ నష్టాలను కొంతలో కొంత తగ్గించే అవకాశం ఉందని ఎండీ చెప్పారు. కానీ అంత మేరకు చార్జీలు పెంచే అవకాశం లేనందున డీజీల్ సెస్ విధిస్తున్నామన్నారు.