ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక ప్రక్రియలో గందరగోళం నెలకొంది.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న యువతకు ఇటీవలే ఏపిపిఎస్సీ(ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్) ద్వారా రాత పరీక్షలు నిర్వహించారు. అయితే ఇందుకు సంబంధించిన ప్రాథమిక కీ ని గత శనివారమే ఏపిపిఎస్సీ విడుదల చేయగా... తాజాగా దాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. సాంకేతిక కారణాల వల్ల ఈ నెల 26న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్ష ‘కీ’ ఉపసంహరించుకున్న ఏపీపీఎస్సీ వెల్లడించింది.
సచివాలయ ఉద్యోగాల కోసం ఏపీపీఎస్సీ మొత్తం 14 రకాల రాతపరీక్షలు నిర్వహించింది. ఈ రాతపరీక్షల ప్రాథమిక ‘కీ’ని అధికారులు తొలుత శనివారం రాత్రి గ్రామ సచివాలయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ప్రతి ఒక్క పరీక్షకు నాలుగు రకాల టెస్ట్ బుక్‌లెట్ సిరీస్ కోడ్ వారీగా కీలను రిలీజ్ చేశారు. అభ్యంతరాలు తెలిపేందుకు అభ్యర్థులకు మూడు రోజులు గడువు కూడా ఇచ్చింది. వీటన్నింటిని తాజాగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16,208 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఈ నెల 20వ తేదీ మొదలైన రాత పరీక్షలు ఈనెల 26 సాయంత్రం కంప్లీట్ అయ్యాయి. ఈ ఎగ్జామ్స్ కు 72.73 మంది అభ్యర్ధులు హాజరైనట్టు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. అయితే టెక్నికల్ రీజన్స్ వల్ల ఈ నెల 26న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్ష ‘కీ’ ఉపసంహరించుకున్నారు. ఈ కీ ని మళ్లీ అప్‌లోడ్ చేయనున్నారు. అసౌకర్యానికి చింతిస్తున్నామని గోపాల కృష్ణ ద్వివేది ట్విట్టర్ ద్వారా తెలిపారు.
