ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆమె... ఎన్నికలు జగన్ భయపడరని స్పష్టం చేశారు.

ఉద్యోగులు, ప్రజల కోసమే ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతున్నారని రోజా వెల్లడించారు. ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం తీర్పు ఇస్తే ఎన్నికలకు సిద్ధం అవుతామని ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ తెలిపారు.

దేశంలో ప్రస్తుత పరిస్ధితులను దృష్టిలో వుంచుకుని సుప్రీంకోర్టు ఎన్నికలను వాయిదా వేస్తుందని రోజా అభిప్రాయపడ్డారు. కలెక్టర్ అహంకారంతో ప్రజాప్రతినిధులను అగౌరవపరిచారని ఆమె మండిపడ్డారు.

తిరుమలలో ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం  రోజా ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు జరిగితే 100 శాతం మంది జగన్‌వైపే వున్నారని.. ప్రివిలేజస్ కమిటీ వున్నది ప్రతిపక్షాల కోసమే కాదన్నారు. 

కాగా, తొలివిడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ నిన్న విడుదల చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయం వస్తే తప్పకుండా పాటిస్తామని ఎస్‌ఈసీ స్పష్టం చేశారు.

రెవెన్యూ డివిజన్‌ ప్రాతిపదికగానే ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. తొలి దశలో విజయనగరం, ప్రకాశం జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి ముందుకెళ్తున్నట్టు రమేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు.