ఎన్నిసార్లు, ఎన్నిపార్టీలు మారుతారు మేడం.. క్రిమినల్స్‌ను కాపాడతారా : పురంధేశ్వరిపై పోసాని ఫైర్
ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ నేత, ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారని.. మీ ఆయనకు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇస్తానని ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.

ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ నేత, ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి ఫైర్ అయ్యారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్రిమినల్స్‌ను కాపాడటం మీ మెంటాలిటీనా అని ప్రశ్నించారు. ఎన్నిసార్లు, ఎన్ని పార్టీలు మారుతారు మేడం అంటూ సెటైర్లు వేశారు. ఎన్టీఆర్ మద్యపార నిషేధం చేస్తే.. బాబు మద్యం ఏరులై పారించారని పోసాని దుయ్యబట్టారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారని.. మీ ఆయనకు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇస్తానని ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.
కాగా.. గతవారం పోసాని మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పును ఒప్పుకోవాలన్నారు. చంద్రబాబు ఏడాది పాటు జైలులో వుండి బయటకు వచ్చేటప్పుడు నిజాయితీగా వస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. చంద్రబాబు గతంలో 17 సార్లు కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకున్నారని పోసాని ఆరోపించారు. చంద్రబాబుకు పోలవరం ప్రాజెక్ట్ ఏటీఎంలా మారిందని గతంలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించిన విషయాన్ని కృష్ణమురళీ గుర్తుచేశారు. చంద్రబాబుకు దోమల మందు, ఏసీ, దోమల తెరను తాను కొనిస్తానంటూ సెటైర్లు వేశారు.
Also Read: ఆమె మాటలు వింటే నవ్వొస్తోంది.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి : బ్రాహ్మణికి పోసాని కౌంటర్
నారా బ్రహ్మణి మాటలు విని నవ్వుకోవాలంటూ పోసాని కౌంటరిచ్చారు. ఆమె మాటలు వింటే జడ్జి మీద కూడా కేసులు పెట్టాలేమోనంటూ ఆయన వ్యాఖ్యానించారు. మీ తాతను వెన్నుపోటు పొడిచిందెవరు..? మీ తాతను చెప్పుతో కొట్టిందెవరు..? మీ తాతను చంపిందెవరు..? అనే ప్రశ్నలకు బ్రాహ్మణి సమాధానం చెప్పాలని పోసాని సవాల్ విసిరారు. రామారావును వెన్నుపోటు పొడిచింది.. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది ప్రజల కోసమేనా అంటూ కృష్ణమురళి సెటైర్లు వేశారు. అవినీతి పనులు చేస్తేనే జైల్లో పెడతారని.. అక్కడ ప్రశాంతంగా ఏడాదో, ఏడాదిన్నరో వుండొచ్చు కదా అంటూ పోసాని చురకలంటించారు.
ఇకపోతే.. రాష్ట్రంలో పొత్తులపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పందిస్తూ ఓ స్పష్టత ఇచ్చారు. నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందని, ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర బీజేపీ అందుకు కట్టుబడి ఉంటుందని వివరించారు. టీడీపీతో పొత్తుపై పవన్ కళ్యాణ్ తమ పార్టీ అధిష్టానానికి వివరిస్తారని, ఆ వివరణ తర్వాతే బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. విశాఖపట్నంలో పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. ప్రజా వేదిక కూల్చివేత తర్వాత నుంచి రాష్ట్రంలో అరాచక పాలన మొదలైందని ఆమె చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వేధిస్తున్నారని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో వ్యవహరించడం బాధాకరమని తెలిపారు.