అమరావతి: ఏపీ రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ప్రభుత్వ నిర్ణయానికి ఏపీఈఆర్‌సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 500 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్‌ను వినియోగించినవారిపై ఛార్జీల పెంపు వర్తించనుంది.

విద్యుత్  ఛార్జీల పెంపు విషయమై ఏపీ ప్రభుత్వం ఏపీఈఆర్‌సీని కోరింది. 500 యూనిట్లలోపు ఎలాంటి ఛార్జీలు పెంచబోమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. పెంచిన విద్యుత్ ఛార్జీలతో  రాష్ట్రంలోని 1.35 లక్షల మంది గృహ విద్యుత్ వినియోగదారులపై భారం పడే అవకాశం ఉంది.

ప్రస్తుతం  500 యూనిట్లు దాటితే యూనిట్ కు  రూ.9.05 పైసలు వసూలు చేస్తున్నారు. 500 యూనిట్లు దాటితే ఇక నుండి రూ. 9.95పైసలు వసూలు చేయనున్నారు.  పెంచిన విద్యుత్ ఛార్జీలతో  ఏపీ రాష్ట్రంలోని ప్రభుత్వ, కార్పోరేట్ సంస్థలపై భారం పడనుంది.

ఏపీలో డిస్కంలు తీవ్ర నష్టాల్లో ఉన్నందున చార్జీలను పెంచేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఏపీఈఆర్‌సీని కోరింది. ఏపీఈఆర్‌సీ 500 యూనిట్లకు పైగా విద్యుత్ ను వినియోగించుకొనేవారిపై 90 పైసలు పెంచుకొనేందుకు అనుమతిని ఇచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వం  వ్యవసాయానికి ఉచిత  విద్యుత్ కోసం రూ. 8,353.58 కోట్లు సబ్సిడీగా చెల్లించేందుకు అంగీకరించింది. గత ఏడాదితో పోలిస్తే 18 శాతం ఎక్కువగా సబ్సిడీని ప్రభుత్వం చెల్లించనుంది.

సబ్సిడీ  పెంచడంతో అదనంగా 18 లక్షల మంది వ్యవసాయదారులకు ప్రయోజనం పొందే అవకాశం ఉంది.  500 యూనిట్లలోపు గృహ వినియోగదారులకు తక్కువ ధరకు విద్యుత్ సరఫరాను చేయనుంది సర్కార్. రూ.1707.07 కోట్లను సబ్సిడీ రూపంలో విద్యుత్ సంస్థలకు చెల్లించేందుకు ఏపీ సర్కార్ అంగీకరించింది.

ప్రతి నెలకు  ఆనెలలోని విద్యుత్ వినియోగం పైనే వర్గీకరణకు కూడ ఏపీఈఆర్‌సీ ఆమోదం తెలిపింది. ఎల్ టీ  కేటగిరీ లో ఉన్న లాభాపేక్ష లేని సంస్థలు, ప్రభుత్వ ఆసపత్రులు,ప్రభుత్వ విద్యాసంస్థ లకు హెచ్ టీ సాధారణ కేటగిరీ లో బిల్లింగ్ చేయనున్నారు.

  ధోబీ ఘాట్ లకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనుంది ప్రభుత్వం. ప్రజా ప్రయోజనాల కోసం రైల్వే టారిఫ్ యూనిట్ 6.50రూపాయిల 5.50కి తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు యూనిట్ రూ. 12.20రూపాయిల నుంచి 6.70కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకొన్నారు. 2019-20 లో ప్రారంభించిన హెచ్ టీ పరిశ్రమలకు లోడ్ ఫ్యాక్టర్ ఇన్సెంటివ్ ఈ ఏడాది కూడా కొనసాగించాలని ప్రభుత్వం తలపెట్టింది. రైస్ మిల్లలు,పల్వ రైజింగ్ మిల్లులకు 100 హెచ్ పీ నుంచి 150కి పెంచుతూ ఎల్టీ కేటగిరీలో బిల్లింగ్ చేయనున్నారు.