గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కించపరుస్తూ ఇటీవల వచ్చిన కథనాలపై ఏపీ మహిళా కమీషన్ స్పందించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతం సవాంగ్‌కు రాష్ట్ర మహిళా కమీషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ శుక్రవారం లేఖ రాశారు.

గురువారం వాసిరెడ్డిని కలిసిన శ్రీదేవి.. తనకు సంబంధం లేని కేసుల విషయంలో తన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిపై స్పందించిన పద్మ... ఈ వ్యవహారంపై పూర్తి విచారణ జరపాలని డీజీపీ సవాంగ్‌కు లేఖ రాశారు. ప్రజాప్రతినిధులుగా ఉన్న మహిళల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె లేఖలో పేర్కొన్నారు.

Also Read:ఆ అపార్ట్ మెంట్ లో...పట్టుబడ్డ వారితో నాకు సంబంధాలా?: వైసిపి మహిళా ఎమ్మెల్యే కంటతడి

కాగా , గత కొద్ది రోజుల క్రితం మంగళగిరి పెదకాకాని పరిధిలోని ఓ అపార్టుమెంట్లో కొందరు పేకాట ఆడుతుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో తన ప్రమేయం ఉందని వస్తున్న వార్తలను ఎమ్మెల్యే శ్రీదేవి తీవ్రంగా ఖండించారు.

ఈ విషప్రచారాలపై నిన్న గుంటూరు రేంజ్ ఐజీ, ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది అన్నారు. ఒక ఎమ్మెల్యేపై డాక్టర్ అని కూడా లేకుండా ఇలాంటి అసత్యాలు ప్రచారం చేయడం దుర్మార్గం అని ఆవేదన వ్యక్తం చేశారు. 

అయినా పేకాట ఆడుతున్నది, పోలీసులు దాడిచేసింది నంబూరు గ్రామం తన నియోజకవర్గంలో లేదు... ఇలా పక్క నియోజకవర్గంలో పేకాట జరిగితే తాడికొండ నియోజకవర్గంకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. తాను ఎవ్వరినీ విడవమని పోలీసులకు ఫోన్ చేయలేదని... పోలీసుల విచారణలో అసలు నిజాలు బయటకు వస్తాయన్నారు.