గుంటూరు: కేవలం టీఆర్పీ రేటింగ్స్ కోసమే కొన్ని మీడియా సంస్థలు తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని వైసీపీ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులోని తన కార్యాలయంలో శ్రీదేవి మీడియా సమావేశం నిర్వహించి తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై మాట్లాడారు. ముఖ్యంగా పేకాట క్లబ్ వ్యవహారంపై ఆమె స్పందించారు. 

గత కొద్ది రోజుల క్రితం మంగళగిరి పెదకాకాని పరిధిలోని ఓ అపార్టుమెంట్లో కొందరు పేకాట ఆడుతుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో తన ప్రమేయం ఉందని వస్తున్న వార్తలను ఎమ్మెల్యే శ్రీదేవి తీవ్రంగా ఖండించారు. ఈ విషప్రచారాలపై నిన్న గుంటూరు రేంజ్ ఐజీ, ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది అన్నారు. ఒక ఎమ్మెల్యేపై డాక్టర్ అని కూడా లేకుండా ఇలాంటి అసత్యాలు ప్రచారం చేయడం దుర్మార్గం అని ఆవేదన వ్యక్తం చేశారు. 

అయినా పేకాట ఆడుతున్నది, పోలీసులు దాడిచేసింది నంబూరు గ్రామం తన నియోజకవర్గంలో లేదు... ఇలా పక్క నియోజకవర్గంలో పేకాట జరిగితే తాడికొండ నియోజకవర్గంకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. తాను ఎవ్వరినీ విడవమని పోలీసులకు ఫోన్ చేయలేదని... పోలీసుల విచారణలో అసలు నిజాలు బయటకు వస్తాయన్నారు. 

read more   జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డికి హైకోర్టు షాక్: బెయిల్ పిటిషన్ల తిరస్కరణ

సభ్య సమాజం తల దించుకునే విధంగా ఇష్టం వచ్చినట్లు వార్తలు రాయటం మంచి విధానం కాదన్నారు. ఇలాంటి అసత్య కధనాలు ప్రసారం చేస్తున్న వారిపై తను కేసులు వేసేందుకు కూడా వెనకాడను అని శ్రీదేవి హెచ్చరించారు. ఇకపై ఇలాంటి వార్తలు రాస్తే పరువునష్ట దావా వేస్తానని మీడియా సంస్థలకు ఎమ్మెల్యే హెచ్చరించారు. 

మహిళలను రాజకీయంగా కూడా రాణించేందుకు కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మహిళలు రుణపడి ఉంటారు అని చెప్పారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,మహాత్మ గాంధీ ఆశయాలకు అనుగుణంగా నేడు పాలన సాగుతోంది అని ఎమ్మెల్యే శ్రీదేవి తెలిపారు.