అనుమాన పెనుభూతమై సహజీవనం చేస్తున్న ప్రియురాలిపైనే కత్తితో దాడిచేసాడో దుర్మార్గుడు. సత్తెనపల్లిలో జరిగిన ఈ ఘటనలో ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చేరిన యువతిని ఏపీ మహిళా కమీషన్ చైన్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. 

గుంటూరు: పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో ఓ యువతి సహజీవనం చేస్తున్న ప్రియుడి చేతిలో హత్యాయత్నానికి గురయ్యింది. ప్రియురాలిపై అనుమానం పెరిగి పెనుభూతంగా మారడంతో నడిరోడ్డుపైనే ఆమెపై కత్తితో దాడి చేసాడు. రక్తపు మడుగులో పడివున్న యువతిని జనసేన పార్టీ నాయకులు గుర్తించి హాస్పిటల్ కు తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.

ఉన్మాది చేతిలో కత్తిపోట్లకు గురయి గుంటూరు జిజిహెచ్ లో చికిత్స పొందుతున్న బాధిత యువతిని ఇవాళ(శుక్రవారం) రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. డాక్టర్లను అడిగి ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. బాధితురాలు మాట్లాడలేని స్థితిలో వుండటంతో పోలీసులు, కుటుంబసభ్యులతో మాట్లాడి ఆమెపై జరిగిన హత్యాయత్నం గురించి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ... దుర్మార్గుడి చేతిలో ఫాతిమా తీవ్రంగా గాయపడిందని... మెడపైనే కత్తితో దాడి చేయడంతో లోతైన గాయమైందని తెలిపారు. డాక్టర్లు దాదాపు 5 గంటలపాటు శస్త్రచికిత్స చేసి ఫాతిమా ప్రాణాలను కాపాడారని అన్నారు. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం నిలకడగానే వుందని డాక్టర్లు చెప్పారన్నారు. ఫాతిమాకు అందుతున్న వైద్యం విషయంలో కుటుంబసభ్యులు, బంధువులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని... ఆమె త్వరగా కోలుకోవాలని వారికి ధైర్యం చెప్పినట్లు మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వెల్లడించారు. 

ఫాతిమా పరిస్థితిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళతానని వాసిరెడ్డి పద్మ అన్నారు. వైసిపి ప్రభుత్వం బాధితురాలితో పాటు ఆమె కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు వాసిరెడ్డి పద్మ సూచించారు. 

ఫాతిమాపై దాడికి పాల్పడిన తులసీరామ్ పరారీలో వున్నాడని... అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటయ్యాయని తెలిపారు. అతి త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేసి కఠిన శిక్ష పడేలా చేస్తామని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేసారు.

ఆడపిల్లకు అండనివ్వడంలో వైసిపి ప్రభుత్వం ముందుందని.. మహిళా సంక్షేమం, భద్రత విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మక విధానాలను అమలుచేస్తున్నారన్నారు. అసెంబ్లీ బిల్లు చేసిన 'దిశ' చట్టం స్ఫూర్తితో శరవేగంగా విచారణ, కఠినశిక్షల అమలు జరుగుతుందన్నారు. ప్రేమ పేరిట ఆడవాళ్లను అమానుషంగా హింసకు గురిచేసే కిరాతకులకు తగిన బుద్ధిచెబుతామని మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ పద్మ హెచ్చరించారు. 

అసలేం జరిగిందంటే: 

ఉమ్మడి గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన ఫాతిమాకు పెళ్లయినప్పటికి భర్తకు దూరంగా వుంటోంది. పుట్టింట్లో వుంటూ వారికి భారంగా మారకూడదని భావించి సత్తెనపల్లిలోని పాతబస్టాండ్ ప్రాంతంలో ఓ గదిని అద్దెకు తీసుకుని వుంటోంది. ఇలా ఒంటరిగా వుండే ఆమెపై మాచర్లకు చెందిన తులసీరామ్ కన్నుపడింది. ఆమెతో పరిచయం పెంచుకుని పూర్తిగా నమ్మకం కలిగేలా చేసుకున్నాడు. మగతోడు లేక ఒంటరిగా వుంటున్న ఫాతిమా తులసీ రామ్ తో సహజీవనం ప్రారంభించింది.

కొంతకాలం సాఫీగా సాగిన వీరి సహజీవనంలో అనుమానాలు పెరిగిపోయాయి. ప్రియురాలు ఫాతిమపై అనుమానం పెంచుకున్న తులసీరామ్ గొడవపడటం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే నిన్న (గురువారం) సత్తెనపల్లి పార్క్ ఏరియాలో ఫాతిమాపై కత్తితో దాడి చేసాడు. నిర్మానుష్యంగా వున్న రోడ్డుపై ఆమెను పట్టుకుని మెడపై కత్తితో దాడిచేసి పరారయ్యాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై ఫాతిమా రోడ్డుపైనే కుప్పకూలింది. 

అయితే అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొని పార్టీ కార్యాలయానికి వెళుతున్న జనసేన నాయకులు కొందరు రక్తపుమడుగులో పడివున్న యువతిని గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారమివ్వడంతో పాటు యువతిని ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.