పొంచివున్న మరో వాయుగుండం... ఏపీలోనే తీరం దాటే ప్రమాదం: వాతావరణ శాఖ హెచ్చరిక
ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న ఆంధ్ర ప్రదేశ్ కు మరో వాయుగుండం ప్రమాదం పొంచివుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.
అమరావతి: ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న ఆంధ్ర ప్రదేశ్ కు మరో వాయుగుండ ప్రమాదం పొంచివుందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. థాయ్ లాండ్, దానికి ఆనుకుని వున్న దక్షిణ అండమాన్ సముద్రంలో ఇప్పటికే ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారనుందని తెలిపారు. ఇది ఈ నెల 15వ తేదీన అంటే సోమవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారి 18వ తేదీన ఏపీలో తీరం దాటుతుందని తెలిపారు.
అయితే ఈ వాయుగుండం andhra pradesh లో ఎక్కడ తీరందాటుతుందన్నది ప్రస్తుతానికి స్పష్టత లేదని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. ఈ వాయుగుండం తీరందాటే సమయంలో మాత్రం అల్లకల్లోలం సృష్టించే అవకాశాలుండటంతో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. ఈ వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాలున్నాయని హెచ్చరించారు.
ఇక ఉత్తర తమిళనాడు, దాని పరిసరాల్లో ఆవరించిన ఉపరితల ఆవర్తనం, అక్కడి నుంచి గంగా పరివాహక ప్రాంత పశ్చిమ బంగా వరకు ద్రోణి ఆవరించి వుందని తెలిపారు. దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో అనేక చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణ కేంద్ర సంచాలకులు పేర్కొన్నారు.
read more Heavy Rains in AP: బాధితులకు వెయ్యి రూపాయల ఆర్థిక సాయం: సీఎం జగన్ నిర్ణయం
ఇదిలావుంటే ఇప్పటికే ఏపీని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసాయి. దాదాపు రెండుమూడురోజులు ఆయా జిల్లాల్లో వర్షభీభత్సం కొనసాగింది.
భారీ వర్షాలతో nellore, tirupathi నగరాలు నీటమునిగాయి. వాగులు వంకలు, నదులు పొంగిపొర్లుతూ ప్రమాదకరంగా ప్రవహించడంతో కొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక చెరువుల, జలాశయాల్లోకి వరద నీరు భారీగా చేరుతుండటంతో నిండుకుండల్లా మారాయి.
తిరుమలలో కూడా భారీ వర్షం కురవడంతో వెంకటేశ్వర స్వామి భక్తులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ఏడుకొండలపైకి నడకమార్గంలో వెళ్లే దారి వర్షపునీటితో వాగును తలపించింది. అలాగే వర్షదాటికి ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. రేణిగుంట విమానాశ్రయం, రుయా ఆసుపత్రి కూడా నీటమునిగాయి.
read more వాయు గుండం ఎఫెక్ట్:ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు, విద్యా సంస్థలకు నేడు సెలవు
వర్షప్రభావం ఎక్కువగా వున్న జిల్లాల్లో విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గత గురు, శుక్రవారాలు విద్యాసంస్థలన్నింటికి సెలవు ప్రకటించారు. విద్యార్థులు ఇళ్లనుండి బయటకు రావద్దని హెచ్చరించారు. వర్షప్రభావం పూర్తిగా తగ్గినతర్వాతే స్కూళ్లను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇక ఈ వర్షాలు, ఈదురుగాలుల దాటికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికందివచ్చిన పంట నీటమునగడం, ధాన్యం తడిసిపోవడం వంటి అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ వర్షాల దాటికి ఇళ్లలోకి కూడా నీరుచేరి ప్రజలు ఇబ్బందిపడ్డారు.
మరోవైపు తిరుపతి విమానాశ్రయానికి రావాల్సిన ఆరు విమానాలు వర్షం కారణంగా నిలిచిపోయాయి. హైదరాబాద్ నుంచి రేణిగుంట రావాల్సిన ఇండిగో విమానం ప్రతికూల వాతావరణం కారణంగా తిరిగి హైదరాబాద్ వెళ్లింది. ఇలా పలు విమానాలు వెనుదిరగగా రైళ్ల రాకపోకలకు కూడా ఈ వర్షాలు అంతరాయం కలిగించారు. రోడ్డు రవాణా కూడా వర్షాల కారణంగా నిలిచిపోయింది.