Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే..?

ఆంధ్రప్రదేశ్ రవాణా, క్రీడలు, యువజన సర్వీసుల శాఖల మంత్రిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కీలక ఫైలుపై తొలి సంతకం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపైనా ప్రకటన చేశారు.

AP Transport minister takes Charge... Announcement on RTC free bus facility for women GVR
Author
First Published Jun 23, 2024, 12:57 PM IST | Last Updated Jun 23, 2024, 12:57 PM IST

ఆంధ్రప్రదేశ్‌ రవాణా, క్రీడలు, యువజన సర్వీసుల శాఖల మంత్రిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యత చేపట్టేందుకు ఆదివారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయనకు వేద పండితులు పూర్ణకుంభం స్వాగతం పలికారు. అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. ప్రత్యేక పూజల అనంతరం మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి తన సీట్లో కూర్చున్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో రూ.18.51 కోట్ల అంచనా వ్యయంతో డ్రైవింగ్ శిక్షణ, రీసెర్చ్ సంస్థను ఏర్పాటు చేసే ఫైలుపై తొలి సంతకం చేశారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. 

ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యాన్ని త్వరలోనే కల్పించనున్నట్లు తెలిపారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉచిత బస్సు సౌకర్యం పథకంలో ఎదురయ్యే లోటుపాట్లు ఆంధ్రప్రదేశ్‌లో తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది నిరుపేద క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా పలు చర్యలు చేపడతామన్నారు. క్రీడల పరంగా రాష్ట్రంలోని పేద విద్యార్థులను ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. 

తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం కారణంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు వర్గాల నుంచి ఉచిత సర్వీసుపై వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. ఇలాంటి వాటన్నింటినీ సమీక్షించుకొని రాబోయే నెల రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. రానున్న ఐదేళ్లపాటు ఈ పథకాన్ని ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అమలు చేసేలా కసరత్తు చేస్తున్నామన్నారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios