ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ ఏపీ ట్రాన్స్కో (AP Transco) రాష్ట్రంలో నిరాటంకంగా విద్యుత్ అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందకోసం ఏఐ టెక్నాలజీని ఉపయోగించనున్నారు.
రాష్ట్రంలో నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేందుకు ఏపీ ట్రాన్క్సో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కచ్చితమైన వాతావరణ వివరాలు అవసరమని భావిస్తోంది. ఇందులో భాగంగా ఎఐ ఆధారిత టూల్స్‌ను ఉపయోగించి విద్యుత్ డిమాండ్‌ను ముందుగానే అంచనా వేయాలని ప్రయత్నిస్తోంది.
డిమాండ్‌ను బట్టి విద్యుత్ కొనుగోలు
రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల మార్పుల వల్ల విద్యుత్ వినియోగం తరచూ మారుతూ ఉంటుంది. గత నెలలో ఏపీ రికార్డు స్థాయిలో రోజుకు 257 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగించింది. గత ఏడాది గరిష్టంగా 263 మిలియన్ యూనిట్లు వినియోగం జరిగింది.
సాధారణంగా రోజువారీ విద్యుత్ డిమాండ్ 230 నుంచి 250 మిలియన్ యూనిట్ల మధ్య ఉంటుంది. ఈ పరిస్థితుల్లో, విద్యుత్ అవసరాన్ని ముందే అంచనా వేసుకోవడానికి కచ్చితమైన వాతావరణ వివరాలు అవసరమవుతున్నాయి. ప్రతీ 15 నిమిషాలకు ఉష్ణోగ్రత, తేమ, వర్షపాతం వంటి వివరాలపై కచ్చితమైన ఫోర్‌కాస్ట్ కోరుతోంది. ఇందుకుగాను ప్రస్తుతం సంస్థ ఐఎమ్‌డీ, రియల్ టైమ్ గవర్నెన్స్, టైమ్ అండ్ డేట్ వంటి వాతావరణ సంస్థలపై ఆధారపడుతోంది.
ఏఐ సహాయంతో
10 ఏళ్ల డేటాను కృత్రిమ మేధస్సు టూల్‌కు ఇచ్చి అంచనా వేయనున్నారు. ఇందులో భాగంగా సెలవులు, వీకెండ్స్, పండుగలు, ఐపీఎల్ మ్యాచ్‌లు, రిపీట్‌గా జరిగే ఈవెంట్లు వంటివి గుర్తించి, కోడ్ రూపంలో ఎఐ టూల్‌కి ఇస్తారు. ఈ డేటా ద్వారా ఎఐ టూల్ తదుపరి రోజు విద్యుత్ డిమాండ్ అంచనా వేస్తుంది.
ప్రస్తుతం వాతావరణ సమాచారం పూర్తిగా ఖచ్చితంగా లేకపోవడంతో, AI అంచనాల్లో 1 శాతం నుంచి 3 శాతం వరకు తప్పులు వస్తున్నాయి. అధికారులు చెబుతున్నట్టు... డిమాండ్ కన్నా ఎక్కువ విద్యుత్ కొనుగోలు చేస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది. తక్కువ కొనుగోలు చేస్తే విద్యుత్ కోతలు ఏర్పడి ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. కాబట్టి కచ్చితమైన వాతావరణ అంచనా ద్వారా విద్యుత్ కొనుగోలును సమర్థవంతంగా నిర్వహించవచ్చని వారు తెలిపారు.