Tata Harrier EV: టాటా మోటార్స్ భారత్‌లో కొత్త హారియర్ EV మోడల్‌ను విడుదల చేసింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 625 కి.మీ. ప్రయాణిస్తుంది. హైఎండ్ ఫీచర్స్ తో ఇంత ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం విశేషం. ఈ కారు ధర, ఫీచర్స్ తెలుసుకుందామా?

టాటా మోటార్స్ భారత్‌లో కొత్త హారియర్ EV మోడల్‌ను విడుదల చేసింది. ఈ కారు ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర రూ.21.49 లక్షలు గా ఉంది. ఈ మోడల్‌ను తొలిసారి ప్రొడక్షన్-రెడీ వేరియంట్‌గా ఆటో ఎక్స్‌పో 2025లో ప్రదర్శించారు. ఈ ఎలక్ట్రిక్ SUV బుకింగ్స్ జూలై 2 నుండి ప్రారంభం కానున్నాయని కంపెనీ తెలిపింది.

హారియర్ EVలో రెండు బ్యాటరీ ప్యాక్ లు..

హారియర్ EVలో రెండు బ్యాటరీ ప్యాక్స్ వేరియంట్లు ఉన్నాయి. అవి 75kWh, 65kWh. ఈ బ్యాటరీలకు అనుసంధానంగా రెండు రకాల ఎలక్ట్రిక్ మోటర్లు (డ్యూయల్, సింగిల్ మోటర్) కూడా ఉన్నాయి. హారియర్ EV గరిష్టంగా 390bhp పవర్, 504Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఒకే ఛార్జ్‌తో 627 కిలోమీటర్ల రేంజ్ వరకు ప్రయాణిస్తుందని కంపెనీ ప్రకటించింది. కేవలం 6.3 సెకన్లలో హారియర్ EV 100 కి.మీ. వేగం అందుకుంటుంది. 

పాత హారియర్ కంటే భిన్నంగా EV వెర్షన్

అవుట్ లుక్ లో హారియర్ EV తన డీజిల్ వేరియంట్‌ కంటే భిన్నంగా ఉంటుంది. ఫ్రంట్, రియర్ బంపర్లు కొత్తగా అమర్చారు. డ్యూయల్ టోన్ ఏరో డిజైన్ అల్లాయ్ వీల్స్‌తో ఈ ఎలక్ట్రిక్ కారు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. 

హారియర్ EV నాలుగు రంగుల్లో లభిస్తుంది. అవి నైనిటాల్ నాక్టర్న్, ఎంపవర్డ్ ఆక్సైడ్, ప్యూర్ గ్రే, ప్రిస్టిన్ వైట్. టాటా మోటార్స్ "స్టెల్త్ ఎడిషన్"ను కూడా ప్రకటించింది. ఇది బ్రాండ్‌లో తొలి ఎలక్ట్రిక్ స్పెషల్ ఎడిషన్ అవుతుంది. అయితే దీని గురించి పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. 

హారియర్ EV ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే..

హారియర్ EVలో అడ్వెంచర్, ఫియర్‌లెస్, ఎంపవర్డ్ అనే మూడు వేరియంట్లు ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో పానొరామిక్ సన్‌రూఫ్ అద్భుతంగా ఉంది. పిల్లలు, పెద్దలు సన్ రూఫ్ వ్యూ ని బాగా ఎంజాయ్ చేస్తారు. దీంతోపాటు నాలుగు స్పోక్స్ స్టీరింగ్ వీల్, 14.5-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్ వంటి సూపరిస్టిక్ ఫీచర్లు కూడా ఉన్నాయి. 

హారియర్ EV ఏ రోడ్డులోనైనా దూసుకుపోగలదు..

హారియర్ EVలో ఐదు భిన్నమైన టెరైన్ మోడ్స్ ఉన్నాయి. అవి నార్మల్, సాండ్, రాక్-క్రాల్, మడ్ రట్స్, కస్టమ్. మట్టి రోడ్డు, ఇసుక రోడ్డు, కొండలు.. ఇలా రోడ్డు ఎలాంటిదైనా దూసుకుపోయే విధంగా టాటా ఈ ఎలక్ట్రిక్ కారును తయారు చేసింది. ముందు సీట్లకు వెంటిలేషన్, మెమొరీ ఫంక్షన్లు, బాస్ మోడ్ లాంటి సౌకర్యాలు కల్పించారు. రెండవ వరుసలో సీటుకు కంఫర్ట్ హెడ్‌రెస్ట్ వంటి అధునాతన సౌకర్యాలు కూడా ఉన్నాయి.

హారియర్ EVలో 6 ఎయిర్ బ్యాగులు..

హారియర్ EV 12.25 అంగుళాల డిజిటల్ కలర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను కలిగి ఉంది. అంతేకాకుండా లెవల్ 2 ADAS, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్, డ్రైవ్ మోడ్స్ వంటి భద్రతా అంశాలు కూడా ఉన్నాయి. కొత్తగా సమ్మన్ మోడ్, QWD కూడా పొందుపరిచారు.

హారియర్ EV మార్కెట్‌లో ఇప్పటికే ఉన్న మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుందని టాటా కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.