ఏపీలో ఎస్‌జీటీ ఉపాధ్యాయుల బదిలీల్లో మ్యాన్యువల్ కౌన్సిలింగ్ విధానాన్ని అమలు చేయాలని మంత్రి లోకేష్ నిర్ణయించారు.

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఉపాధ్యాయుల బదిలీలపై కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్‌జీటీ)ల బదిలీ ప్రక్రియలో ఇకపై ఆన్లైన్‌ విధానానికి బదులుగా మ్యాన్యువల్ కౌన్సిలింగ్ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా ప్రకటించారు.

పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన పర్యటన సందర్భంగా నారా లోకేష్(Nara Lokesh) పలువురు టీడీపీ (TDP)ఎమ్మెల్సీలతో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వేపాడ చిరంజీవి, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామ్‌గోపాల్ రెడ్డి, ఆలపాటి రాజా, పేరాబత్తుల రాజశేఖర్‌లు ఆయనతో కలిసి ఎస్‌జీటీ కౌన్సిలింగ్ సమస్యలపై చర్చించారు. ఉపాధ్యాయుల నుంచి వచ్చిన అభిప్రాయాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు లోకేష్ తెలిపారు.

వెబ్ కౌన్సిలింగ్ విధానం..

ఇటీవల కాలంలో ఉపాధ్యాయులు వెబ్ కౌన్సిలింగ్ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. కొన్ని చోట్ల నిరాహార దీక్షలు, డైరెక్టరేట్ కార్యాలయాల ముట్టడులు వంటి ఆందోళనలకు కూడా దిగారు. వెబ్ కౌన్సిలింగ్‌లో సీనియారిటీ ఆధారంగా స్కూళ్ల ఎంపిక చేసే విధానం చాలా క్లిష్టమైందని, చిన్న తప్పు కూడా కెరీర్‌ను ప్రభావితం చేసే ప్రమాదముందని వారు తెలిపారు.

ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు నారా లోకేష్‌ను కలిసి మ్యాన్యువల్ కౌన్సిలింగ్‌కు మద్దతు తెలిపారు. వారు చెప్పిన సమస్యలను స్వయంగా అర్థం చేసుకున్న మంత్రి, వెంటనే చర్యలు తీసుకోవాలని భావించారు. దాంతో ఎస్‌జీటీల బదిలీల్లో ఇక మాన్యువల్ విధానమే అమలవుతుందని స్పష్టం చేశారు.

వెబ్ కౌన్సిలింగ్‌ను కొనసాగించాలని మొదట విద్యాశాఖ ప్రకటించినప్పటికీ, ఉపాధ్యాయుల నిరసనలతో ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుంది. అధికారుల మాట ప్రకారం, మాన్యువల్ విధానంలో ఉపాధ్యాయులకు తమ అభిరుచికి అనుగుణంగా ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.

ఇకపై ఎస్‌జీటీ ఉపాధ్యాయులు బదిలీ కోసం ఆన్లైన్ ద్వారా కాకుండా ప్రత్యక్షంగా కౌన్సిలింగ్‌కు హాజరై ఎంపిక చేసుకునే అవకాశం కలిగినట్లు ఈ నిర్ణయం ద్వారా స్పష్టమవుతోంది.