Asianet News TeluguAsianet News Telugu

ఆ పోలీసుల పేర్లు రాసుకుంటున్నాం... భవిష్యత్ లో వారి తాటతీస్తాం: అచ్చెన్న స్ట్రాంగ్ వార్నింగ్

తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్న పోలీస్ అధికారులు పేర్లు రాసిపెట్టుకుంటున్నామని... భవిష్యత్ లో వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. 

AP TDP President Kinjarapu Atchannaidu Strong Warning to Police Officers
Author
Guntur, First Published Sep 13, 2021, 11:14 AM IST

అమరావతి: వైసీపీ పాలనలో కొందరు పోలీసుల అరాచకాలకు రోజురోజుకీ అడ్డూ అదుపు లేకుండా పోతోందని ఏపీ టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. పోలీసులు తమ పరిది దాటి చట్టాలను ఉల్లఘింస్తూ రాజ్యాంగాన్ని దిక్కరిస్తూ వైసీపీ నేతలు చెప్పినట్టు చేస్తున్నారని ఆరోపించారు. శాంతి భద్రతలను రక్షించాల్సిన పోలీసులు వైసీపీ నేతలతో కుమ్మక్కయి తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో టీడీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్నారని అచ్చెన్న ఆందోళన వ్యక్తం చేశారు. 

''గ్రామ పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేశారన్న కారణంతో టీడీపీ కార్యకర్త అంజిపై కడప జిల్లా చిన్నమండెం పోలీసులు అక్రమ కేసులు పెట్టారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి హింసించారు. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం'' అన్నారు. 

''పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేస్తే పోలీసులకు వచ్చిన ఇబ్బందేంటి? ఎవరి ఆదేశాల మేరకు టీడీపీ కార్యకర్త అంజిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారో పోలీసులు చెప్పాలి.  కండ్రికలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడితే  వైసీపీ కార్యకర్తలను వదిలేసి టీడీపీ కార్యకర్తల్ని పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు'' అని ఆందోళన వ్యక్తం చేశారు.  

read more  కాల్వ శ్రీనివాసులపై వ్యాఖ్యలు.. జేసీ ప్రభాకర్ రెడ్డికి పయ్యావుల కౌంటర్
    
''వైసీపీ పాలనలో పోలీసు వ్యవస్ధ పనితీరు పట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పోలీసులకు ప్రభుత్వం జీతాలు ఇచ్చేది ఎందుకు? రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడానికా ? లేక టీడీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టు చేయడానికా?'' అని ప్రశ్నించారు. 

''కొందరు పోలీసుల వ్యవహరిస్తున్న తీరుతో మొత్తం పోలీసు వ్యవస్ధకు చెడ్డపేరు తెస్తోంది. వైసీపీ రెండున్నరేళ్ల పాలనలోనే టీడీపీ నాయకులు, కార్యకర్తలపై నమోదు చేసిన తప్పుడు కేసులతో పోలీసు స్టేసన్లలో ఎఫ్ఐఆర్ పుస్తకాలన్నీ నిండిపోయాయి. టీడీపీ నేతలు, కార్యకర్తలపై పెట్టిన ప్రతి తప్పుడు కేసును, ఆ కేసు పెట్టిన పోలీసు అధికారుల పేర్లను రాసుకుంటున్నాం. ఇప్పుడు పెట్టిన ప్రతి తప్పుడు కేసుకు భవిష్యత్ లో తగిన మూల్యం చెల్లించక తప్పదు. తప్పుడు కేసులు పెట్టి టీడీపీ నాయకులని, కార్యకర్తల్ని ఇబ్బందులు పెట్టిన ఏ ఒక్కరిని వదలం. పోలీసులు ఇకనైనా తమ పద్దతి మార్చుకుని చట్టం ప్రకారం నడుచుకోవాలి'' అని అచ్చెన్న స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.    
 
 

Follow Us:
Download App:
  • android
  • ios