Asianet News TeluguAsianet News Telugu

పెన్షన్ పెంపు.. ఇదేనా మాట తప్పను, మడమ తిప్పనంటే: జగన్‌పై అచ్చెన్నాయుడు విమర్శలు

వృద్ధాప్య పెన్షన్‌ పెంపుపై టీడీపీ (tdp) ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (atchannaidu) ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అధికారం చేపట్టి ఇప్పటికీ మూడేళ్లు ముగుస్తున్నా పెంచి ఇచ్చింది కేవలం రూ. 250 మాత్రమే అంటూ ఎద్దేవా చేశారు. ఇదేనా మాట తప్పను.. మడమ తిప్పను అంటే అంటూ సెటైర్లు వేశారు.

ap tdp president atchannaidu slams ys jagan due to pension hike
Author
Amaravathi, First Published Jan 1, 2022, 8:27 PM IST

వృద్ధాప్య పెన్షన్‌ పెంపుపై టీడీపీ (tdp) ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (atchannaidu) ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పెన్షన్‌ను (pension) రూ.2000 నుండి రూ.3000లకు పెంచుతా... అవసరమైతే రూ.4000లకు పెంచుతా'' అంటూ 06.02.2019న తిరుపతి సభలో జగన్‌ (ys jagan mohan reddy) ఊదరకొట్టారని దుయ్యబట్టారు. మే 31, 2019న ప్రమాణ స్వీకార సభలో మాటమార్చి ఏటా రూ.250 చొప్పున పెంచుకుంటూ పోతానన్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.  అధికారం చేపట్టి ఇప్పటికీ మూడేళ్లు ముగుస్తున్నా పెంచి ఇచ్చింది కేవలం రూ. 250 మాత్రమే అంటూ ఎద్దేవా చేశారు. ఇదేనా మాట తప్పను.. మడమ తిప్పను అంటే అంటూ సెటైర్లు వేశారు.

దేశంలోనే మొట్టమొదటిసారిగా పెన్షన్ల పథకం ప్రవేశపెట్టింది ఎన్టీఆర్ (nt ramarao) అని.. 40 సంవత్సరాల క్రితం రూ.35 పెన్షన్‌తో మొదలు పెట్టిన ఘనత తెలుగుదేశానికే దక్కిందని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. తర్వాత చంద్రబాబు దానిని రూ.75 లు చేశారని... 2014 లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే నాటికి రూ.200 ఉన్న పెన్షన్ మొత్తాన్ని రూ.1000 చేశారని ఆయన వెల్లడించారు. తర్వాత రూ. 2000 చేశారని... మొత్తం ఐదు సంవత్సరాలలో రూ.1,800 పెంచి 54.25 లక్షల మందికి అందించారని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. కానీ జగన్ రెడ్డి రెండున్నర సంవత్సరాలలో రూ. 250 పెంచి ఒకొక్కరికీ రూ. 23,250 ఎగనామం పెట్టి 54.25 లక్షల పెన్షన్ దారులకు రూ. 12,613 కోట్లు మోసం చేశాడంటూ దుయ్యబట్టారు.

Also REad:మధ్యాహ్నం నుంచే రూ. 2,500 పింఛన్ పంపిణీ.. వాళ్లకు కొత్త ఏడాది అయిన మంచి ఆలోచనలు రావాలి : సీఎం జగన్

చంద్రబాబు రూ.1800 పెంచినా ప్రచారం చేసుకోలేదని.. కానీ జగన్ రెడ్డి రూ.250 పెంచి.. రూ.20 కోట్లు ఖర్చు పెట్టి పత్రికల్లో ప్రచారం చేసుకుంటున్నారని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. ఇప్పటికి మూడుసార్లు ప్రచారంతో రూ. 60 కోట్లు ప్రజాధనం వృధా చేశారని ఆయన ఆరోపించారు. వయోపరిమితి తగ్గించడంతో లక్షలాది మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చానని ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి.. కొత్తగా ఎంత మందికి పెన్షన్లు మంజూరు చేశారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. 

అధికారికం లెక్కల ప్రకారమే ప్రస్తుతం మొత్తం పెన్షన్ దారులు 60 లక్షలు కూడా లేరన్నారు. కుటుంబాలు కలిసి ఉంటేనే సంతోషమని నాడు చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ప్రోత్సహించారని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో.. ఇంట్లో ఇద్దరికి పెన్షన్లు అందేవని... కానీ నేడు.. ఇంట్లో ఒక్కరికి మాత్రమే పెన్షన్ అంటూ ముసలోళ్ల నోటి దగ్గర కూడును లాక్కుంటున్నారని ఆయన అన్నారు. ఒక రేషన్ కార్డులో ఇద్దరు పెన్షన్ దారులుంటే పెన్షన్ ఇవ్వబోమనడం దుర్మార్గం కాదా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

ఒకే ఇంట్లో పది పదవులుండొచ్చు.. కానీ ఇద్దరికి పెన్షన్ ఉండకూడదా..? ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి, బాబాయి టీటీడీ ఛైర్మన్, తమ్ముడు ఎంపీగా ఉన్నారని ఆయన గుర్తుచేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి, ఆయన తమ్ముడు ఎమ్మెల్యే, కుమారుడు ఎంపీ. ముఖ్యమంత్రి ఆయన అనుయాయుల కుటుంబాలు పదుల సంఖ్యలో రాజకీయ పదవులు పొందారని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. ఏ-2 రెడ్డి అయితే పదుల సంఖ్యలో పదవులు అనుభవిస్తూ.. కోట్లాది రూపాయిలు జీతంగా బొక్కుతున్నాడని ఆయన ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios