కరోనా తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన సానుకూల వాతావరణం కారణంగానే ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.

బుధవారం ఈసీ నిర్వహించిన ఆల్‌పార్టీ మీటింగ్‌కు హాజరైన అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. కరోనా సాకు చెప్పి ఎన్నికలు వద్దంటన్న ప్రభుత్వానికి మరి మద్యం షాపులు వద్ద క్యూలు గురించి గుర్తులేదా అని ఆయన సెటైర్లు వేశారు.

Also Read:ఆశ్చర్యం: వైసీపీ లేఖకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కౌంటర్

టీడీపీ హయాంలో రేషన్ దుకాణాల వద్ద అన్ని సరులకు ఒకే వేలిముద్ర వేసేవారని.. కానీ ఇప్పుడు విడివిడిగా వేలిముద్రలు వేయమంటున్నారని అప్పుడు కరోనా రాదా అని ఆయన ప్రశ్నించారు.

అలాగే నవంబర్ 2 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని, అప్పుడు కరోనా గుర్తు రాలేదా అని అచ్చెన్నాయుడు నిలదీశారు. జగన్ 16 నెలల పాలనపై ప్రజల్లో ఆగ్రహం వుందని.. ఓటమి భయంతోనే వైసీపీ కరోనా సాకుతో ఎన్నికలను వాయిదా వేయమని కోరుతోందని ఆయన చెప్పారు.

ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని.. అలాగే గతంలో నామినేషన్లు వేసేందుకు వెళితే, స్వయంగా పోలీసులే అడ్డుకున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

అయితే ప్రతి ఒక్క పౌరుడు ఇంట్లో ఉండే నామినేషన్ వేసేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ఏపీలో పోలీసు వ్యవస్థపై స్వయంగా ఎన్నికల కమీషనర్‌కే నమ్మకం లేదని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు.