ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు గాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బుధవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి సంబంధించి ఎస్ఈసీ ప్రెస్ నోట్ విడుదల చేశారు.

సమావేశానికి 11 రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారని ఈ మెయిల్‌ ద్వారా రెండు పార్టీలు తమ అభిప్రాయాలను తెలియజేశాయని నోట్‌లో తెలిపారు. వైసీపీ సహా 6 పార్టీలు ఈ సమావేశానికి హాజరుకాలేదని వివరించారు.

వైద్య ఆరోగ్య శాఖతో చర్చించలేదన్న వైసీపీ ప్రెస్‌నోట్‌పై ఎస్ఈసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. విస్తృత స్థాయి సంప్రదింపుల తర్వాతే సమావేశానికి ఆహ్వానించామని తెలిపారు. వైసీపీ రాసిన లేఖ ఆశ్చర్యకరంగా ఉందన్నారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్.

ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినా... ఎవరితోనూ సంప్రదింపులు జరపలేదని రాయడం సరికాదని ఆయన హితవు పలికారు. మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సింఘాల్, కాటమనేని భాస్కర్‌తో సమావేశమయ్యామని నిమ్మగడ్డ చెప్పారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై చర్చించామని, సీఎస్‌తో కూడా సమావేశమవుతామని ఆయన స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే రాజకీయ పార్టీలను సమావేశానికి ఆహ్వానించామని.. ఎస్ఈసీ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తుందని చెప్పారు. మధ్యాహ్నం చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నితో నిమ్మగడ్డ భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు ఎస్ఈసీకి టీడీపీ, బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌తో సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తమ పార్టీల వైఖరిని తెలియజేశారు.

గత ఎన్నికల ప్రక్రియ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఎస్ఈసీకి టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, సీపీఐలు సూచించాయి. అధికార దుర్వినియోగానికి పాల్పడి గతంలో ఏకగ్రీవాలు జరిగాయని బీఎస్పీ, బీజేపీ అభిప్రాయపడ్డాయి.

కరోనా వ్యాప్తి నివారణా చర్యలు తీసుకుంటూ స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీని కోరాయి. సీపీఎం మాత్రం రీషెడ్యూల్ అంశాన్ని నిమ్మగడ్డ వద్ద ప్రస్తావించలేదు. గతంలో ఏకగ్రీవాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించాలని సీపీఎం సూచించింది.

ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపాకే, ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ సమావేశానికి వైసీపీ, జనసేన మినహా అన్ని పార్టీలు హాజరయ్యాయి. అయితే జనసేన ఈమెయిల్ ద్వారా తన అభిప్రాయం తెలిపింది.