వూళ్లలో మాట్లాడే మాటనే అన్నా, నాపై కేసు ఎందుకు పెట్టారో : పోలీసులపై అచ్చెన్నాయడు ఆగ్రహం
కుప్పంలో తనపై పోలీసులు కేసు నమోదు చేయడంపై స్పందించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. గ్రామాల్లో రోటిన్‌గా మాట్లాడే మాటనే తాను అన్నానని ఆయన స్పష్టం చేశారు.

కుప్పంలో తనపై కేసు ఎందుకు పెట్టారో అర్ధం కాలేదన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిన్న పోలీసులు ఉత్సవ విగ్రహాల్లా ఉండిపోయారని ఆయన ఆరోపించారు. తాను మాట్లాడిన మాటలను వక్రీకరించారని అచ్చెన్నాయుడు అన్నారు. గ్రామాల్లో రోటిన్‌గా మాట్లాడే మాటనే తాను అన్నానని ఆయన తెలిపారు. లోకేష్ పాదయాత్రతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అచ్చెన్నాయుడు అన్నారు.
ఇంత ప్రజా వ్యతిరేకత వున్న సీఎం దేశ చరిత్రలోనే లేడని.. వైసీపీ పాలనలో అన్ని వర్గాలు మోసపోయాయని ఆయన దుయ్యబట్టారు. లోకేష్ పాదయాత్రకు ప్రజలు స్వచ్ఛందంగానే వస్తున్నారని.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబే సీఎం అవుతారని అచ్చెన్నాయుడు జోస్యం చెప్పారు. వైసీపీ తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు.
ALso REad: ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై పోలీసు కేసు నమోదు.. కారణమిదే..!
కాగా.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం రోజున యువగళం పేరుతో పాదయాత్రను కుప్పం నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అచ్చెన్నాయుడుతో పాటు పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అయితే కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన అచ్చెన్నాయుడు పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎస్సై శివకుమార్ కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అచ్చెన్నాయుడిపై 153 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులను కించపరిచేలా రాజకీయ నాయకులు మాట్లాడటం సరికాదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.