Asianet News TeluguAsianet News Telugu

టీడీపీని, బీసీలను విడదీయడం జగన్ తరం కాదు : వైసీపీ రాజ్యసభ అభ్యర్ధులపై అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు

వైసీపీ రాజ్యసభ అభ్యర్ధులపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశాన్ని, బీసీలను విడదీయడం జగన్ తరం కాదని ఆయన స్పష్టం చేశారు.

ap tdp president atchannaidu comments on ysrcp rajya sabha candidates
Author
Amaravati, First Published May 18, 2022, 6:36 PM IST

బీసీలు అంటే తెలుగుదేశం... తెలుగుదేశం (telugu desam party) అంటే బీసీలన్నారు టీడీపీ (tdp) ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (atchannaidu) . తలకిందులుగా తపస్సు చేసినా, ఎన్ని జన్మలెత్తినా సరే ఈ బంధాన్ని నీవు విడదీయలేవని ముఖ్యమంత్రి జగన్‌‌ను  (ys jagan) ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీసీలను, టీడీపీని విడదీయడం ఎవరి తరం కాదని, జగన్ తరం కూడా కాదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 

బీసీలకు పదవులిచ్చామని సీఎం చెప్పుకుంటున్నారని... దేనికి ఈ పదవులని ఆయన ప్రశ్నించారు. పదవులిచ్చి, నోళ్లకు ప్లాస్టర్ వేయడానికా? అని ఆయన ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రాన్ని నలుగురు రెడ్లకు రాసి పెట్టారని... ఉత్తరాంధ్రని ఒకరికి, కోస్తాంధ్రను ఒకరికి, కృష్ణా, గుంటూరు జిల్లాలను ఒకరికి, రాయలసీమను ఒకరికి రాసిచ్చారని అచ్చెన్నాయుడు విమర్శించారు. అయితే, రెడ్లంటే తనకు ఎలాంటి కోపం లేదని చెప్పారు. 

బీసీ సామాజిక వర్గానికి చెందిన తాను టీడీపీ హయాంలో మంత్రిగా పని చేశానని... తాను, కేఈ కృష్ణమూర్తి, యనమల, కళా వెంకట్రావు, కొల్లు రవీంద్ర, పితాని సత్యనారాయణ వంటి బీసీ మంత్రులందరూ స్వతంత్రంగా పని చేశామని అచ్చెన్నాయుడు చెప్పారు. జగన్ పాలనలో బీసీ మంత్రులు కనీసం మాట్లాడే పరిస్థితిలోనైనా ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు.

ఇకపోతే.. వైసీపీ ప్రభుత్వంపై తన అసమ్మతి తెలిపిన ఎస్సీ మహిళ వెంకాయమ్మకు (venkayamma) వైసీపీ నాయకులు, కార్యకర్తల నుంచి రక్షణ కల్పించాలని గుంటూరు ఎస్పీకి టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు లేఖ రాసారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజాస్వామ్యబద్ధంగా తమ అసమ్మతి తెలుపుతున్న వారిపై దాడికి పాల్పడుతున్నారని... రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వంపై తన అసమ్మతి తెలిపిన ఎస్సీ-మాల సామాజిక వర్గానికి చెందిన వెంకాయమ్మపై జరిగిన దాడే ఇందుకు నిదర్శనమని అచ్చెన్న పేర్కొన్నారు. 

''వెంకాయమ్మ నిరుపేద మహిళ. ఆమెకున్న 3 ఎకరాల వ్యవసాయ భూమిని స్థానిక వైసీపీ నాయకుడు అక్రమంగా ఆక్రమించుకున్నాడు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. మే 16న తన భూమి సమస్యపై ఫిర్యాదు చేసేందుకు గుంటూరు వెళ్లారు. కానీ స్పందనలో నుంచి ఎలాంటి స్పందన రాలేదు. స్పందన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ విధానాలపై తన అసమ్మతిని తెలియజేసింది. వైసీపీ ప్రభుత్వంపై తన అసమ్మతి తెలిపినందుకు స్థానిక వైసీపీ మద్దతుదారులు ఆమెపై భౌతిక దాడి చేసి ఇంట్లో ఉన్న కిరాణా సామాన్లు, పాత్రలు ధ్వంసం చేశారు. ఆమె కుమారుడిపై దాడి చేసి అతడి సెల్ ఫోన్‌ను ధ్వంసం చేశారు'' అని వెంకాయమ్మ జరిగిన దాడిని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. 

''వెంకాయమ్మపై భౌతికంగా దాడి చేయడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా ఆమెపై దుష్ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో  ఆమెపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఆమెపై జరుగుతున్న విద్వేషపూరిత ప్రచారాన్ని వెంటనే ఆపేలా చర్యలు తీసుకోండి'' అని అచ్చెన్న ఎస్పీని కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios