Asianet News TeluguAsianet News Telugu

ఆ విషయంలో... తెలంగాణ సర్కార్ ను ఫాలో కండి..: జగన్ కు అచ్చెన్న లేఖ

ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేసే టీచర్లను ఆదుకోవాలని ఏపీ టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బహిరంగ లేఖ రాశారు. 

AP TDP Chief Atchannaidu  Writes open Letter to CM YS Jagan akp
Author
Amaravathi, First Published Apr 22, 2021, 12:29 PM IST

అమరావతి: కరోనా కారణంగా స్కూళ్లు మూతపడటంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేసే టీచర్లను ఆదుకోవాలని ఏపీ టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరారు. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా ఏపీ ప్రభుత్వం కూడా ప్రైవేట్ టీచర్లకు కరోనా ప్యాకేజీ ప్రకటించాలంటూ సీఎంకు అచ్చెన్న ఓ బహిరంగ లేఖ రాశారు. 

అచ్చెన్నాయుడు బహిరంగ లేఖ యధావిధిగా... 

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు,
ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్.

విషయం: ప్రైవేట్ టీచర్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం గురించి - ప్రైవేట్ టీచర్లకు కరోనా ప్యాకేజీ అందించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
    
                                    ఎంతో మంది విద్యార్ధులుగా భావిభారత పౌరులుగా తీర్చిదిద్దటంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం. దేశాన్ని ముందుకు నడిపించడంలో ఉపాధ్యాయుల చొరవ అంతా ఇంతా కాదు.  అటువంటి ఉపాధ్యాయుల బతుకులు ముందుకు సాగక చతికిలపడుతున్నాయి. రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల్లో దాదాపు 5 లక్షల మందికి పైగా టీచింగ్, నాన్ టీచింగ్ టీచర్లకు జీతాలు అందక అన్నమో రామచంద్రా అంటూ ఆకలితో అలమటిస్తున్నారు. పాఠశాలలు నడవక కొంత మంది ఉపాధ్యాయులు కూరగాయలు అమ్మటం, చెప్పులు కుట్టడం, భవన నిర్మాణ కార్మికులుగా మారి రోజు వారి కూలీలు చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు.  ప్రైవేటు టీచర్లను ఆదుకోవడంలో ప్రభుత్వ ఘోరంగా వైఫల్యం చెందింది.  

గత ఏడాదిలో వచ్చిన కరోనా మొదటి వేవ్ నుంచి ఇప్పటి వరకు ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఆదుకున్న పాపాన పోలేదు. విద్యా సంస్థలు సరిగా నడవక, జీతాలు సకాలంలో అందక, కుటుంబ పోషణ జరగక ఇప్పటి వరకు 25 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు చనిపోయినా మీకు మనస్సు ఎందుకు కరగటం లేదు?  కరోనాతో ఒక వైపు ప్రైవేట్ విద్యా సంస్థలు సరిగా నడవక మరో వైపు ప్రభుత్వం పట్టించుకోక వారి పరిస్థితి దుర్బరంగా తయారయ్యిందన్న సంగతి ఎందుకు గుర్తించటం లేదు? మీకు వైన్ షాపుల మీద ఉన్న ధ్యాస విద్యా వ్యాప్తికి ప్రైవేట్ టీచర్లకు అండగా నిలవడంలో లేకపోవడం దురదృష్టకరం. 

తెలంగాణలో ప్రభుత్వం ప్రైవేట్ టీచర్లను ఆదుకునేందుకు  నెలకు రూ. 2000 నగదుతో పాటు.. 25 కిలోల బియ్యం కూడా పంపిణీ చేస్తుంది. అలాగే మిగిలిన రాష్ట్రాలు కూడా వారిని ఏదో ఒక రకంగా ఆదుకుంటున్నాయి. కాని మీకు మాత్రం అవేమి పట్టవా?  కాబట్టి కరోనా కారణంతో ఉపాధి కోల్పోయిన ప్రైవేట్‌ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, భోధనేతర సిబ్బందికి కరోనా ప్యాకేజీ  కింద నెలకు రూ.10వేల బృతితో ఆదుకోవాలి. బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణ సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వ రంగ సంస్థల్లో అవుట్ సోర్సింగ్ లో ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. 

కింజారపు అచ్చెన్నాయుడు,
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు. 

Follow Us:
Download App:
  • android
  • ios