Asianet News TeluguAsianet News Telugu

ఏపీకి జగన్ రెడ్డి రూపంలో శని పట్టుకుంది: సాధన దీక్షలో అచ్చెన్నాయుడు

కరోనా బాధితులకు భరోసా కల్పించేందుకు టీడీపీ కొన్ని నెలలుగా పోరాడుతోందని...అయినా ఈ ప్రభుత్వానికి, మూర్ఖపు ముఖ్యమంత్రిలో చలనం లేదని అచ్చెన్న మండిపడ్డారు. 

ap tdp chief atchannaidu fires on cm jagan in sadhana deeksha akp
Author
Amaravati, First Published Jun 29, 2021, 12:58 PM IST

అమరావతి: క‌రోనా బాధితులకు అండగా పలు డిమాండ్ల సాధ‌న‌కు తెలుగుదేశం పార్టీ సాధన దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దీక్షలో పాల్గొన్న టిడిపి ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... కరోనా బాధితులకు భరోసా కల్పించడమే నేటి దీక్ష ధ్యేయమన్నారు. బాధితులకు భరోసా కల్పించేందుకు టీడీపీ కొన్ని నెలలుగా పోరాడుతోందని...అయినా ఈ ప్రభుత్వానికి, మూర్ఖపు ముఖ్యమంత్రిలో చలనం లేదని అచ్చెన్న మండిపడ్డారు. 

''ప్రకృతి వైపరీత్యాలు, ఉపద్రవాలను ఆపడం మానవుడికి సాధ్యం కాదు. కానీ ఎదుర్కోవడం అసాధ్యమేమీ కాదు. మన రాష్ట్రానికి జగన్ రెడ్డి రూపంలో శని పట్టింది. పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ అంటూ కరోనా మహమ్మారిని నిర్లక్ష్యం చేశారు. చేతకాని ముఖ్యమంత్రి, చేవజచ్చిన పాలనతో వేలాది మంది బలైపోయారు'' అని మండిపడ్డారు. 

''మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ నేత కాదు.. డిజాస్టర్ మేనేజ్ మెట్ డిక్షనరీ. ఇంతకంటే పెద్ద పెద్ద విపత్తులెన్నింటితో టిడిపి హయాంలో సమర్ధవంతంగా ఎదుర్కొన్నాం. సంవత్సరం నుండి ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చినా ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి చలించలేదు'' అని అచ్చెన్న ఆరోపించారు. 

read more  శవాలపై పేలాలను ఏరుకునేవారినీ జగన్ రెడ్డి తలదన్నుతున్నాడు: లోకేష్ ఫైర్

కరోనా కష్టకాలంలో ఉపాధినే కాదు ప్రాణాలను కోల్పోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం సాయం అందించాలని టిడిపి డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఇవాళ(మంగళవారం) రాష్ట్రవ్యాప్తంగా సాధన దీక్ష చేపట్టింది. 

తెలుగుదేశం పార్టీ కరోనా డిమాండ్లు:
 
కరోనా పేద, దిగువ మధ్య తరగతి ప్రజలను కోలుకోలేని దెబ్బ తీసింది. కరోనాతో సుమారు కోటి మంది ఉపాధి కోల్పోయారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి ప్రతి తెల్ల రేషన్‌ కార్డు ఉన్న కుటుంబాలకు, ఆదాయపు పన్ను పరిమితికి లోబడి ఉన్న కుటుంబాలకు తక్షణ సాయంగా రూ. 10 వేలు ఆర్థిక సాయం అందించాలి. కరోనా తీవ్రత కొనసాగినంతకాలం నెలకు రూ. 7,500 అందించాలి. 

కొవిడ్‌లో మరణించిన ప్రతి కుటుంబానికి ఆర్థిక చేయూత అందించి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కాబట్టి కరోనా మృతుల కుటుంబాలకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షలు ఆర్థిక సాయం  అందించాలి. 

ఆక్సిజన్‌ మరణాలన్నిటికి ప్రభుత్వానిదే బాధ్యత కాబట్టి వారి కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలి.

అకాల వర్షాలతో కుదేలైన వ్యవసాయరంగం కరోనా కారణంగా మరింత దెబ్బతింది. ఈ క్రమంలో రైతులను ఆదుకునేందుకు వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలి. 

విధి నిర్వహణలో చనిపోయిన వైద్య, పారిశుద్ధ్య , పోలీస్, కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కుటుంబాలకు ఆలస్యం చేయకుండా రూ. 50 లక్షలు అందించాలి. 

కేంద్రం ఫ్రంట్‌లైన్‌ వారియర్ర్స్ గా గుర్తించి రూ.50 లక్షల బీమా సౌకర్యం కల్పించింది. అదేవిధంగా ఏపీ ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని జర్నలిస్టులను కరోనా వారియర్స్ గా  గుర్తించి వారికి బీమా సౌకర్యం కల్పించాలి.

వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, ప్రజలందరికీ వ్యాక్సిన్ లను ఉచితంగా అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి.

Follow Us:
Download App:
  • android
  • ios