అమరావతి: వైసీపీ అరాచకాలు, దౌర్జన్యాల నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు చట్టబద్ధంగా న్యాయ సహాయం చేసేందుకే కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు తెలుగుదేశం పార్టీ  రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. అయితే ఈ కాల్ సెంటర్ పై వైసిపి దుష్ప్రచారం చేస్తోందని... తెలుగుదేశం పార్టీ దీనిని తీవ్రంగా ఖండిస్తోందన్నారు. 

''వైసీపీ దిగజారుడు చర్యలకు పాల్పడుతోంది. తెదేపా నేతలపై నిఘా కోసం కాల్‌సెంటర్‌, ఐ-టీడీపీ ఏర్పాటు చేసినట్లు వైసీపీ సోషల్‌ మీడియాలో ప్రచారం చేయడం సిగ్గుచేటు. జగన్ రెడ్డి తన కార్యకర్తలను పట్టించుకున్న పాపాన పోలేదు. వారి త్యాగాల మీద గద్దెనెక్కిన ఆయనకు కార్యకర్తల విలువ తెలియదు. తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ. మా కార్యకర్తలను కుటుంబసభ్యులుగా భావించి వారికి అన్నివేళలా అండగా నిలబడేందుకు కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసింది'' అని వివరించారు.

''7306299999, 7557557744 నెంబర్లకు ఎప్పుడు ఫోన్‌ చేసినా తెలుగుదేశంపార్టీ కార్యకర్తలకు సహకారం అందించడం జరుగుతుంది. కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కాల్‌సెంటర్‌పై దుష్ప్రచారం చేసిన వైసీపీ సోషల్‌ మీడియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి'' అని అచ్చన్న డిమాండ్‌ చేశారు.