Asianet News TeluguAsianet News Telugu

నీ ఇడుపులపాయలోనే చూసుకుందాం... సిద్దమా జగన్: అచ్చెన్నాయుడు సవాల్

ఆంధ్ర ప్రదేశ్ లో వైపిసి అధికారంలోకి రావడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ధౌర్భాగ్యమని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 

ap tdp chief atchannaidu challenge to cm ys jagan
Author
Mangalagiri, First Published Jan 5, 2022, 3:00 PM IST

అమరావతి: ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని అణచివేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan) ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (atchannaidu) అన్నారు. కానీ వైసీపీ (ysrcp)లా గాలికి పుట్టిన పార్టీ తమది కాదని... పేదల అభ్యున్నతి కోసం శ్రామికుల చెమటలోంచి పుట్టిన పార్టీ టిడిపి (TDP) అని గుర్తిస్తే మంచిదన్నారు. ఈ పార్టీని నాశనం చేయడం, ఇబ్బంది పెట్టడం నీవల్లే కాదు నీ ముత్తాత, తాత, తండ్రి వల్ల కూడా కాదని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో జరిగిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందదాయకమన్నారు. రెండున్నరేళ్లల్లో టిడిపి నాయకులు, కార్యకర్తలపై ఎన్ని సమస్యలు, ఇబ్బందులు వచ్చినా  ధైర్యంగా ఎదుర్కొని అధికారంలోకి రావడానికి కృషి చేస్తున్నారన్నారు. వారి త్యాగం, తెగువ మర్చిపోలేనిదని అచ్చెన్న అన్నారు.

''మార్చి 29 నాటికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40ఏళ్లు పూర్తి అవుతుంది. అధికారం, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు న్యాయం చేయడమే పరమావధిగా భావించి పని చేశాం. అధికారంలో ఉన్నప్పుడు పేదరికాన్ని నిర్మూలన దిశగా పని చేశాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల పట్ల ఉద్యమాలు చేశాం'' అని పేర్కొన్నారు. 

''దేశంలో మొట్ట మొదటిసారిగా దుర్మార్గమైన ముఖ్యమంత్రి, దోపిడీ పార్టీ మన రాష్ట్రంలో అదికారంలోకి రావడం ధౌర్బాగ్యం. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు అవినీతికి పాల్పడి 16 నెలలు జైల్లో ఉన్నాడని తెలిసినా ప్రజలు 151 సీట్లు ఇచ్చి గెలిపించారు. ఇన్ని సీట్లు వచ్చాయి కాబట్టి పరిపాలన బాగా చేస్తారని అందరూ భావించారు. కాని రెండున్నరేళ్లుగా ఆయన చెప్పిన మాటలకు చేస్తున్న చేతలకు సంబంధం లేదు. రాష్ట్రంలో నేను, నా రాజకీయ పార్టీ తప్ప మరొకరు, మరో పార్టీ ఉండకూదని జగన్ రెడ్డి భావించి ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయించారు'' అని ఆరోపించారు.

read more  రాష్ట్రానికి వైసీపీ గ్రహణం పట్టింది: పార్టీ నేతల సమావేశంలో చంద్రబాబు

''సమాజంలో మంచిపేరు తెచ్చుకోవాలని మా ఆస్తులు తాకట్లు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం. కాని జగన్ రెడ్డి కక్షపూరితంగా బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై ప్రలోభాలకు గురి చేసినా, ఆస్తులు ధ్వంసం చేసినా, కేసులు పెట్టినా లొంగ లేదు. వీళ్లు మొండివాళ్లని గ్రహించి చివరకు ప్రతిపక్ష పార్టీ నాయకుడి ఇంటిపై దాడి చేయించాడు. ఇందుకు జగన్ రెడ్డికి సిగ్గనిపించడం లేదా? చంద్రబాబు నాయుడిని ఇబ్బందులకు గురి చేయాలని, తప్పులను ఎత్తి చూపాలని ప్రయత్నించి భంగపడ్డారు. జగన్ రెడ్డి... జీవితాంతం తపస్సు చేసినా చంద్రబాబుపై వెల్లిత్తి చూపించలేవు'' అని అచ్చెన్న హెచ్చరించారు.

''టీడీపీ హయాంలో విద్యార్ధులు, యువత భవిష్యత్ కోసం డిజైన్ టెక్, స్కిల్ డెవలప్ మెంట్, సీమన్స్ కలిసి రూ.3,300 కోట్లతో ఒక ప్రాజెక్టును 40 సెంటర్లలో ఏర్పాటు చేశాం. అందులో 10 శాతం రాష్ట్ర ప్రభుత్వానిది, 90 శాతం సీమెన్స్ ది. దిక్కుమాలిన ముఖ్యమంత్రి రెండున్నరేళ్లల్లో ఇటువంటి ప్రాజెక్టు ఒక్కటైనా తెచ్చారు. 40 సెంటర్లలో ఐటెమ్స్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ.370 కోట్లు విడుదల చేసింది.  అందులో రూ.250 కోట్లు చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన అనుయాయులు తినేశారని జగన్ రెడ్డి అబద్దపు ప్రచారం చేశారు'' అని మండిపడ్డారు. 

''ఒక ప్రైవేట్ యాడింగ్ కంపెనీ ద్వారా ఆడిట్ చేయించి, ఒక్క ఐటెమ్ కూడా స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లకు వెళ్లలేకపోయినా డబ్బులు చెల్లించారని సీఐడీతో తప్పుడు కేసులు పెట్టారు.  ఈ డబ్బంతా మాకు దొరికింది... సింగపూర్ కు వెళ్లిందని సాక్షిలో అబద్దపు రాతలు రాయించారు. 40 సెంటర్లలో ఒక ఐటెమ్స్ రాలేదని అంటున్నారు... నిజంగా మీ అధికారులు ఎక్కడైనా వెరిఫికేషన్ చేశారా? ఎక్కడో కాదు ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో సీమెన్స్ పెట్టిన వస్తువులన్ని ఉన్నాయో లేదో వెరిఫై చేసేందుకు నాతో నువ్వు వస్తావా జగన్ రెడ్డి. అక్కడ ఐటెమ్స్ లేకపోతే నువ్వు చెప్పిన శిక్షకు మేము సిద్దపడతాం. ఐటెమ్స్ ఉంటే మేము చెప్పిన శిక్షకు నువ్వు సిద్దపడతావా?'' అని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.

read more  విధ్వంసకుడిగా మారిన జగన్: చంద్రబాబు ఫైర్

''నీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన అవినీతికి నీ అకౌంట్లో పడ్డాయి. కాని చంద్రబాబు నాయుడు, లోకేష్ అకౌంట్లు చెక్ చేసుకో నీలా అవినీతి పాల్పడే బుద్ది మాది కాదు. నువ్వు అవినీతి చేశావని సాక్షాత్తు ఈడీ చెప్పింది. రేపు టీడీపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడిపై అక్రమంగా కేసు బనాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. గడిచిన 5 నెలలుగా టీడీపీ సముద్రపు కెరటాల్లా స్పీడ్ పెంచింది. దానికి నాయకత్వం వహించాల్సిన గురుతరమైన బాధ్యత మనందరిపై ఉంది'' అని అచ్చెన్నాయుడు టిడిపి నాయకులకు సూచించారు. 

 
 

Follow Us:
Download App:
  • android
  • ios