ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం షైనింగ్ స్టార్స్ అవార్డులతో 5,088 మంది టాప్ విద్యార్థులను జూన్ 9న సత్కరించనుంది. నగదు, మెడల్, సర్టిఫికెట్ అందించనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) విద్యారంగాన్ని మెరుగుపరచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. 'షైనింగ్ స్టార్స్' (Shining Stars) పేరుతో ప్రతిభ చూపిన విద్యార్థులను గుర్తించి, వారిని పురస్కారాలతో సత్కరించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించినవారిని ఎంపిక చేసి, వారికి రూ.20 వేలు నగదు, మెడల్, సర్టిఫికేట్‌లు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 9న అవార్డుల కార్యక్రమం జరుగనుంది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగే ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు.
ఇప్పటికే పదో తరగతి పరీక్షల్లో 4,169 మంది, ఇంటర్‌లో 919 మంది విద్యార్థులను ఎంపిక చేసిన అధికారులు, మొత్తం 5,088 మందికి అవార్డులు అందించనున్నారు. ఎంపిక ప్రక్రియను మండలాల వారీగా పదో తరగతికి, జిల్లాల వారీగా ఇంటర్‌కు నిర్వహిస్తున్నారు.ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, పదో తరగతిలో కనీసం 500 మార్కులు (83.33 శాతం) సాధించినవారికి అవార్డు దక్కుతుంది. ప్రత్యేక అవసరాల విద్యార్థులకు ఈ అర్హత 70 శాతంగా నిర్ణయించారు. ఇంటర్‌లో సాధారణ విద్యార్థులకు 830 మార్కులు, ప్రత్యేక అవసరాల విద్యార్థులకు 700 మార్కులు కట్‌ఆఫ్‌గా నిర్దేశించారు.
ప్రతి మండలంలో ఆరుగురు పదో తరగతి విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. ఇందులో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రతినిధులకు ప్రాధాన్యం ఇస్తారు. ఇంటర్ విద్యార్థులను జిల్లాల ఆధారంగా ఎంపిక చేసి వారికి ప్రోత్సాహకంగా షైనింగ్ స్టార్స్ అవార్డులు అందిస్తారు.
