అమరావతి: పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ మీద ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ మరింత మెరుగ్గా వ్యవహరించాల్సి ఉండిందని ఆయన అన్నారు. శనివారం ఆయన గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు 

తాను సమావేశం నిర్వహిస్తే రాకపోవడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు నిమ్మగడ్డ తెలిపారు. నిన్న హాజరు కావాలని కోరినా అధికారులు రాలేదని, వైఫల్యానికి అందరిపై చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాలని సీఎస్ ను, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శిని కోరామని ఆయన చెప్పారు. 

Also Read: వెనక్కి తగ్గని నిమ్మగడ్డ: నోటిఫికేషన్ జారీ, సుప్రీంలో పిటిషన్ మీద వ్యాఖ్య

2019 ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామని, విధి లేని పరిస్థితిలో మాత్రమే ఆ జాబితాతో ఎన్నికల నిర్వహణ చేపట్టాల్సి వచ్చిందని ఆయన అన్నారు. పంచాయతీరాజ్ శాఖ అలసత్వం వల్ల 3.50 లక్షల మంది ఓటు హక్కు కోల్పోయారని ఆయన అన్నారు. ఓటర్ల జాబితాను సిద్ధం చేయడంలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అలక్ష్యంతో వ్యవహరించారని ఆయన విమర్శించారు. పంచాయతీరాజ్ కమిషనర్ మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ రాసిన లేఖ తనకు అందడం కన్నా ముందే మీడియాకు చేరిందని ఆయన చెప్పారు. ఆర్టీఐ నుంచి మినహాయింపులు ఉన్నప్పటికీ కమిషన్ విషయంలో జరిగే ఉత్తరప్రత్యుత్తరాల్లో గోప్యత పాటించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

తమకు నిధుల కొరత ఉందని ఆయన చెప్పారు. నిధులను, సిబ్బందిని తాము కోరినప్పుడు సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన చెప్పారు. కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, జాయింట్ డైరెక్టర్ ఎవరూ లేరని, అయినా ఎన్నికలు నిర్వహించి తీరుతామని ఆయన చెప్పారు.