అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు వస్తే పాటిస్తామని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను నిలువరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దానిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ విషయం చెప్పారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ తొలి విడత నోటిఫికేషన్ జారీ సందర్భంలో ఆయన శనివారంనాడు మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ స్ఫూర్తితో ఎన్నికల కమిషన్ ఏర్పడిందని, సకాలంలో ఎన్నికలు నిర్వహించడం తమ విధి అని ఆయన అన్నారు. సీఎస్, డీజీపి పరిణతి చెందిన అధికారులు అని, పంచాయతీరాజ్ శాఖ మెరుగైన తీరును ప్రదర్శించాల్సి ఉందని ఆయన అన్నారు. 

నాలుగు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని ఆయన చెప్పారు. ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో తొలి విడత ఎన్నికలు లేవని ఆయన చెప్పారు. ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా ప్రభుత్వం కోర్టులో బలంగా వాదనలు వినిపించిందని, ఎన్నికలు జరగాల్సిన అవసరంపై కమిషన్ వాదించిందని ఆయన చెప్పారు. 

ఎన్నికలకు సంబంధించిన సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని ఆయన చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ బాధ్యతా రాహిత్యం వల్ల సమస్యలు వచ్చాయని, బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు. దేనికైనా విధానాలు, విధులు ఉన్నాయని, వాటిని పాటించాల్సిందేనని ఆయన అన్నారు. 

అవరోధాలు వచ్చినా ఎన్నికలు నిర్వహించి తీరుతామని నిమ్మగడ్డ చెప్పారు. ఎన్నికల నిర్వహణపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, దీని ప్రభావం అభ్యర్థులపై గానీ ఎన్నికల తీరుపై గానీ ఉందని అన్నారు. సిబ్బంది కొరత ఉన్నా పనితీరులో అలసత్వం ఉండదని ఆన అన్నారు. దేశమంతా ఎన్నికలు జరుగుతుంటే ఏపీలో వద్దంటున్నారని ఆయన అన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతాయని ఆయన చెప్పారు. 

ఎన్నికల నిర్వహణ అనేది తన వ్యక్తిగత నిర్ణయం కాదని చెప్పారు. నాలుగు దశల్లో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. 

తొలి విడత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఇదీ...

తొలి విడత ఎన్నికలకు ఈ నెల 25వ తేదీ నుంచి నామిషనేషన్లు స్వీకరిస్తారు. 
27 నామిషన్ల స్వీకరణకు తుది గడువు. 
జనవరి 28వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 
29వ తేదీన అభ్యంతరాలపై అపీల్ స్వీకరణ. 
జనవరి 30వ తేదీన అభ్యంతరాలపై తుది నిర్ణయం.  
జనవరి 31 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
ఫిబ్రవరి 5వ తేదీన పోలింగ్, ఉదయం 6.30 నుంచి 3.30 గంటల వరకు
ఫిబ్రవరి 5వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన